శంకర్‌పల్లిలో నిబంధనలకు పాతర !
- నోటీసులకే పరిమితమైన అధికారుల చర్యలు
- నిబంధనలు పాటిస్తున్నారా.. అనుమతులు ఉన్నాయా?
- కమిషనర్ తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం
- ఉన్నతాధికారుల విచారణకు ఫిర్యాదు సిద్ధం
శంకర్పల్లి, అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి పట్టణంలో భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణంపై వివాదం నెలకొంది. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, భూవినియోగం, మాస్టర్‌ప్లాన్, పర్యావరణ పరిరక్షణ తదితర నిబంధనలు పూర్తిస్థాయిలో పాటిస్తున్నారా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నోటీసులిచ్చినా.. పనులు మాత్రం కొనసాగుతున్నాయా?
నిర్మాణానికి సంబంధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే నోటీసుల అనంతరం కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లయితే తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నోటీసులు జారీ చేయడం వరకే అధికారుల చర్యలు పరిమితమయ్యాయా? లేక నిర్మాణదారుడికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? అన్నది స్పష్టం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
111 జీవోపై స్పష్టత అవసరం
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం 1996లో G.O.Ms.No.111 జారీ చేయబడింది.ఈ ఉత్తర్వుల పరిధిలో అప్పట్లో పలు అభివృద్ధి కార్యకలాపాలపై పరిమితులు ఉండేవి. అయితే 2022 ఏప్రిల్ 12న ప్రభుత్వం G.O.Ms.No.69 ద్వారా G.O.111లోని పారా–3 కింద ఉన్న పాత పరిమితులను తొలగించింది.అదే సమయంలో జలాశయాల నీటి నాణ్యతకు హాని కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో శంకర్‌పల్లిలో ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వర్తించే మాస్టర్‌ప్లాన్, భూవినియోగ నిబంధనలు, భవన నిర్మాణ అనుమతులు, నీటి వనరుల పరిరక్షణ నిబంధనలు ఏమిటన్నది అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.
అనుమతులు ఉన్నాయా..? నిబంధనలు పాటించారా..?
భారీ స్థాయిలో ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖలు పలు అంశాలను పరిశీలించాల్సి ఉంది.నిర్మాణానికి భవన అనుమతి ఉందా? అనుమతించిన ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయా? భూమి వినియోగం వాణిజ్య నిర్మాణానికి అనుకూలంగా ఉందా? పార్కింగ్, రహదారి వెడల్పు, ఫైర్ సేఫ్టీ, డ్రైనేజీ, మురుగునీటి నిర్వహణ తదితర నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. భారీ వాణిజ్య నిర్మాణాల కారణంగా భవిష్యత్తులో ట్రాఫిక్, పార్కింగ్, ప్రజల భద్రత, మురుగునీటి నిర్వహణ వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మున్సిపల్ కమిషనర్ తీరుపై ప్రశ్నలు
నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. నోటీసులు జారీ చేసినట్లయితే వాటి అనంతరం ఏ చర్యలు తీసుకున్నారు? నిర్మాణదారుడి నుంచి వివరణ తీసుకున్నారా? అనుమతులను పరిశీలించారా? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే పనులను నిలిపివేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది అధికారులు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, జారీ చేసిన నోటీసులు, అధికారుల తదుపరి చర్యల వివరాలను బహిర్గతం చేస్తే ఈ వ్యవహారంపై నెలకొన్న అనుమానాలకు తెరపడుతుందని వారు అంటున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
స్థానిక మున్సిపల్ యంత్రాంగం చర్యలపై సంతృప్తి చెందని కొందరు స్థానికులు ఉన్నతాధికారులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పురపాలక శాఖ ఉన్నతాధికారులు, సీడీఎంఏ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, భూవినియోగ వివరాలు, సాంకేతిక అనుమతులు, నోటీసులు, అధికారుల చర్యలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి వెలుగులోకి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు.
విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి రావాలి
ఫంక్షన్ హాల్ నిర్మాణంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? నిర్మాణదారుడికి అవసరమైన అన్ని చట్టబద్ధ అనుమతులు ఉన్నాయా? నోటీసుల అనంతరం నిర్మాణ పనులు కొనసాగితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిర్మాణం అనుమతించిన ప్లాన్‌కు అనుగుణంగానే జరుగుతోందా? వంటి ప్రశ్నలకు అధికారిక విచారణ ద్వారానే స్పష్టత రావాల్సి ఉంది.అందువల్ల సంబంధిత ఉన్నతాధికారులు స్థలాన్ని పరిశీలించి, నిర్మాణ అనుమతులు, భూవినియోగం, మాస్టర్‌ప్లాన్, సాంకేతిక అంశాలు, పర్యావరణ నిబంధనలను సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఉల్లంఘనలు లేవని తేలితే అధికారికంగా స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



