పంటను బ్రతికించుకోవడానికి చెమటోడుస్తున్న రైతు దంపతులు!
- రెండు ఎకరాల్లో కంది పంట సాగు..దిగుబడిపై రైతు దంపతులు రామావత్ శాంతదేవి సురేందర్ నాయక్ ల ఆందోళన
- పంటను కాపాడుకునేందుకు బోరు నీటితో తడులు..అన్నదాతల అవస్థలు
- కందనెల్లి తండాలో వర్షాభావంతో దయనీయ పరిస్థితి
పెద్దేముల్, అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసినా వరుణుడు కరుణించకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి.ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు, పంట చేతికందుతుందో లేదోనన్న ఆందోళనతో
సతమతమవుతున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కంది పంటను కాపాడుకునేందుకు కందనెల్లి తండాకు చెందిన రైతు దంపతులు రామావత్ శాంతాదేవి, సురేందర్ నాయక్ మహరాజ్ పడుతున్న శ్రమ అన్నదాతల కష్టాలకు అద్దం పడుతోంది.
రెండు ఎకరాల్లో కంది సాగు
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని కందనెల్లి రెవెన్యూ పరిధి, కందనెల్లి తండా శివారులోని సర్వే నంబర్ 273లో తమకు ఆనువంశికంగా సంక్రమించిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో రైతు దంపతులు ఈ ఏడాది కంది పంట సాగు చేశారు. విత్తనాలు, దుక్కి, ఇతర వ్యవసాయ పనుల కోసం ఇప్పటివరకు సుమారు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు వారు తెలిపారు. పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుందని ఆశించిన తరుణంలో వర్షాలు లేకపోవడంతో పరిస్థితి తారుమారైంది. పంటకు అవసరమైన తేమ అందక ఎండిపోతుండటంతో దిగుబడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోరు నీటితో పంటను కాపాడుకునే ప్రయత్నం
కళ్లముందే పంట ఎండిపోతుంటే చూడలేక, ఎలాగైనా కాపాడుకోవాలనే సంకల్పంతో రైతు దంపతులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరిస్తున్నారు. తమ పొలానికి సమీపంలోని సర్వే నంబర్ 272లో ఉన్న యాడీబాపు గడ్ దేవస్థాన్ ఆధ్యాత్మిక కేంద్రంలో భక్తుల నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన బోరు నుంచి నీటిని పైపుల ద్వారా పొలానికి తరలిస్తున్నారు. ఆ నీటితో కంది పంటకు తడులు అందిస్తూ పంటను నిలబెట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. వర్షాలు కురవకపోయినా, తమ కష్టార్జితం వృథా కాకూడదనే ఆశతో ఎండను సైతం లెక్కచేయకుండా సాగును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పెట్టుబడి తిరిగొస్తుందో లేదోనని ఆవేదన
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతు కుటుంబాలకు వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆర్థిక భారాన్ని మిగులుస్తున్నాయి. పంట సాగు కోసం చేసిన అప్పులు, పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే రూ.60 వేల వరకు ఖర్చు చేసిన తమ కంది పంటను కాపాడుకోవడానికి బోరు నీటిపై ఆధారపడాల్సి వస్తోందని రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సహకరించకపోవడంతో సాగు ఖర్చులు పెరుగుతుండగా, ఆశించిన దిగుబడి రాకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితిని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతు దంపతులు కోరుతున్నారు. పంటల పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన సలహాలు, సహాయక చర్యలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తూ, మరోవైపు పంటను కాపాడుకునేందుకు నీటి వనరులపై ఆధారపడుతున్న రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రైతు చెమట చిందించి పండించే పంట ప్రకృతి వైపరీత్యాలకు బలికాకుండా సంబంధిత యంత్రాంగం స్పందించాలని అన్నదాతలు ఆశిస్తున్నారు.

