రాజేంద్రనగర్లో డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం.
- రూ.4 లక్షల విలువైన మత్తు పదార్థాలు, తుపాకులు పట్టివేత..ఒకరి అరెస్ట్.
శంషాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ సిఖ్ చౌల్ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రూ.4 లక్షల విలువైన మత్తు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని సర్దార్ రాజా సింగ్ (39) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నివాసంలో తనిఖీలు నిర్వహించగా 1.5 కిలోల ఎండు గంజాయి,1.13 కిలోల పోపీ స్ట్రాతో పాటు ఒక రివాల్వర్, రెండు పిస్టల్స్, ఐదు బుల్లెట్లు లభించాయి. నిందితుడు లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తూ,ఆ ముసుగులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. గంజాయి, పోపీ స్ట్రాను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆయుధాలు అతనికి ఎలా లభించాయనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడిలో ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొనగా, నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

