హైదరాబాద్ అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):కేసును మూసివేసేందుకు రూ.6 లక్షల లంచం డిమాండ్ చేసిన మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. కొండల్ రావు, హోమ్‌గార్డ్ అబిద్ అలీని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా సిటీ రేంజ్-1 ఏసీబీ యూనిట్ అధికారులు మంగళవారం దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడి తండ్రిపై మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసును మూసివేయడంతో పాటు, కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, భవిష్యత్తులో సహకరించేందుకు ఇన్స్పెక్టర్ మొత్తం రూ.6 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.3 లక్షలను హోమ్‌గార్డ్ అబిద్ అలీ ద్వారా స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడి, అనుచిత లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై ఇద్దరిపై చర్యలు చేపట్టారు. అనంతరం నిందితులను నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్, హోమ్‌గార్డ్
RELATED ARTICLES

