- రాప్తాడు ఘటనలో గోపిక ప్రాణాలు కాపాడేందుకు లక్ష్మి చూపిన ధైర్యసాహసాలకు అభినందనలు
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా
- లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంద కృష్ణ మాదిగ
అనంతపురం, నవంబర్ 01(ప్రజాక్షేత్రం):అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాహస బాలిక లక్ష్మిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాప్తాడు జడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గోపిక, లక్ష్మి అనే విద్యార్థినులపై హేమంత్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో గోపిక తీవ్రంగా గాయపడగా, ఆమె ప్రస్తుతం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరో విద్యార్థిని లక్ష్మి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదివారం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి లక్ష్మిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. తరగతి గదిలో జరిగిన దారుణాన్ని చూసి విద్యార్థులంతా భయంతో పరుగులు తీస్తున్న సమయంలో లక్ష్మి ఎంతో ధైర్యంగా ఉన్మాదిని అడ్డుకొని గోపిక ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించడం గొప్ప సాహసమని కొనియాడారు. లక్ష్మి చూపిన ధైర్యసాహసాలు అభినందనీయమని, ఆమె సమాజానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. బాధిత బాలికల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, లక్ష్మికి అండగా నిలవాలని సూచించారు. అనంతరం బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపిక ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మికి వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని మంద కృష్ణ మాదిగ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ అధికార ప్రతినిధి డా. వై.కె. విశ్వనాథ్ మాదిగ, ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు సొట్ట నరేందర్ మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బండారు శంకర్ మాదిగ, అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జి ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ, కర్నూలు జిల్లా ఇంచార్జి దుమ్ము చిన్న మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ నాయకులు అమర్నాథ్ మాదిగ, అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు హరి గోపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

