- సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం
- ఆన్లైన్లో సభ్యత్వం.. ఓటర్ ఐడీ కార్డు పొందే అవకాశం
కోటగిరి, నవంబర్ 01(ప్రజాక్షేత్రం):మున్నూరు కాపుల ఐక్యత, సంఘటిత శక్తి, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యత్వ నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను వేములవాడలో ఆవిష్కరించారు. వేములవాడలోని రాజరాజేశ్వరి మున్నూరు కాపు సత్రంలో నిర్వహించిన తెలంగాణ మున్నూరుకాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర ఎన్నికల సమావేశానికి బోధన్ ప్రాంతానికి చెందిన సంఘ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యత్వ నమోదు కోసం రూపొందించిన www.munnurukapusangam.org వెబ్సైట్ను సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ప్రారంభించారు.
ఇక ఆన్లైన్లోనే సభ్యత్వం.. ఓటర్ ఐడీ!
ఈ వెబ్సైట్ ద్వారా సభ్యులు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకుని సభ్యత్వ కార్డు, ఓటర్ ఐడీ కార్డు పొందవచ్చని కొండ దేవయ్య పటేల్ తెలిపారు. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా కూడా సులభంగా సభ్యత్వం పొందే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఈ ఐడీ కార్డు ద్వారా తెలంగాణ మున్నూరుకాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లభిస్తుందని పేర్కొన్నారు.
విభేదాలు వీడి ఐక్యంగా ముందుకు సాగాలి
ఈ సందర్భంగా మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మున్నూరు కాపులందరూ కుల, ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ఉండాలని కోరారు. సంఘంలోని ప్రతి ఒక్కరికీ కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవాలని, ఐక్యతతోనే సామాజిక హక్కులను సాధించుకోగలమని స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఎన్నికల్లో తగిన సంఖ్యలో అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్లు కేటాయించడంతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ బుజ్జి, మాసుల శ్రీనివాస్, తోట శ్రీనివాస్, గంధపు శ్రీపాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

