హైదరాబాద్, నవంబర్ 03(ప్రజాక్షేత్రం):ఖాకీ దుస్తుల వెనుక కఠినమైన విధి నిర్వహణే కాదు.. ఆప్యాయతతో కూడిన అమ్మ మనసు కూడా ఉంటుందని చాటిచెప్పారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప ఎల్బీనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు కు చంటి బిడ్డతో విచారణకు వచ్చిన ఓ బాధితురాలు బిడ్డను చూసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని దీప గమనించారు. వెంటనే మానవీయంగా స్పందించి ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తల్లికి అండగా నిలిచారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్నప్పటికీ, ఓ తల్లికి ఎదురైన ఇబ్బందిని తన బాధ్యతగా భావించి చిన్నారిని అక్కున చేర్చుకున్న తీరు అక్కడున్న వారిని కదిలించింది. యూనిఫామ్‌లో ఉన్నా.. ఆమెలోని అమ్మతనం ఆ పసిబిడ్డకు భరోసానిచ్చింది. చట్టాన్ని కాపాడే చేతులే ఆప్యాయతతో పసిబిడ్డను ఎత్తుకున్న ఈ దృశ్యం న్యాయవాదులు, పోలీసు సిబ్బంది మనసులను హత్తుకుంది. కానిస్టేబుల్ దీప చూపిన మానవత్వాన్ని పలువురు అభినందించారు. ఖాకీ అంటే కేవలం క్రమశిక్షణ కాదు.. అవసరమైన వేళ ఆపన్నులకు అండగా నిలిచే మానవత్వం కూడా అని దీప నిరూపించారు.

