- కుటుంబ కలహాలే హత్యకు కారణమా?
- విడాకుల వివాదం నేపథ్యంలో ఘాతుకం..
- ఆసుపత్రికి తరలించేలోపే మృతి.
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు.
నిర్మల్ జిల్లా నవంబర్ 20(ప్రజాక్షేత్రం):భైంసా రూరల్, కుటుంబ కలహాలు, దాంపత్య జీవితంలో తలెత్తిన విభేదాలు చివరకు ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. కట్టుకున్న భార్యనే భర్త కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన దారుణ ఘటన భైంసా పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని సేవాలాల్ చౌక్ ఆర్ జెడ్ ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీయడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ష అలియాస్ ఫాతిమా (28), భీమ్ అలియాస్ షాహిద్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలినాళ్లలో సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితంలో కొంతకాలంగా కుటుంబ కలహాలు, మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం భైంసా పట్టణంలోని సేవాలాల్ చౌక్ సమీపంలో ఉన్న ఆర్ జెడ్ ఫంక్షన్ హాల్ వద్ద వర్ష ఉండగా, అక్కడికి చేరుకున్న భీమ్ ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడికి దిగాడు. విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఆకస్మిక దాడితో తీవ్ర గాయాలపాలైన వర్ష రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

