- కోయిల్‌సాగర్ తాగునీటిపై మాజీ ఎమ్మెల్యే ఆలకు ఎమ్మెల్యే జీఎంఆర్ మాస్ కౌంటర్!
- 2017 అక్టోబర్ 30న జీవో ఇచ్చింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే..
- కొత్తగా మేమేం జీవో తీసుకురాలేదు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి!
దేవరకద్ర, నవంబర్ 23(ప్రజాక్షేత్రం):కోయిల్‌సాగర్ తాగునీటి సరఫరాపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే జారీ చేసిన జీవోను ఇప్పుడు తమపై ఆరోపణలకు అస్త్రంగా మార్చుకోవడం విడ్డూరంగా ఉందని స్పష్టం చేశారు. 2017 అక్టోబర్ 30న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే హన్వాడ, కోయిలకొండ, ధన్వాడ, కోస్గి తదితర మండలాలకు కోయిల్‌సాగర్ నుంచి తాగునీటి సరఫరా జరుగుతోందని వెల్లడించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి జీవో తీసుకురాలేదని తేల్చిచెప్పారు.
మీ ప్రభుత్వమే జీవో ఇచ్చింది.. ఇప్పుడు మాపై నిందలా?
అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను మరిచిపోయి, ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని జీఎంఆర్ ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేయడానికి ముందు గతంలో మీ ప్రభుత్వమే జారీ చేసిన జీవోను ఒకసారి పరిశీలించాలని హితవు పలికారు.
ఆధారాలు ఉన్నాయి.. వాస్తవాలు ప్రజలకు తెలుసు!
కోయిల్‌సాగర్ తాగునీటి అంశంపై ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టించకుండా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాలకు వాస్తవాలే సమాధానమని ఎమ్మెల్యే జీఎంఆర్ స్పష్టం చేశారు.

