Homeతెలంగాణజన్వాడలో చెరువు భూమికి కబ్జా చెర!

జన్వాడలో చెరువు భూమికి కబ్జా చెర!

📰 Generate e-Paper Clip

  • చెరువు భూమిని ఆక్రమిస్తున్నారంటూ గ్రామస్తుల ఆందోళన
  • ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి కబ్జాకు యత్నం?
  • చెరువులో బోర్లు వేసి అక్రమంగా నీటి విక్రయాలు
  • అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయంటూ స్థానికుల ఆరోపణలు

శంకర్‌పల్లి, నవంబర్ 23(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని చెరువు భూమి కబ్జాకు గురవుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలోని చెరువు స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని, చెరువుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చెరువు పరిధిలో బోర్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా నీటిని అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండదండలతోనే ఈ ఆక్రమణల వ్యవహారం సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే భవిష్యత్తులో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చెరువు హద్దులను గుర్తించాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ బోర్లు, నీటి విక్రయాలపై కూడా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జన్వాడ చెరువు, ప్రభుత్వ భూములను కాపాడుతారా? లేక ఆక్రమణదారుల చేతుల్లోనే ప్రభుత్వ ఆస్తులు మిగిలిపోతాయా? అన్నది వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular