📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeతెలంగాణఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

📰 Generate e-Paper Clip

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

మేడ్చల్ మల్కాజిగిరి, మార్చి 27(ప్రజాక్షేత్రం):శ్రీరామ నవమి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా, నాగారం, కీసర, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పూలతో, విద్యుత్‌ దీపాలతో ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయ పద్ధతిలో కళ్యాణ వేడుకలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి, అనంతరం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ తాళంబ్రాలు, జీలకర్ర-బెల్లం కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళ్యాణ వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిళలు మంగళహారతులు పట్టి భక్తి గీతాలు ఆలపించగా, యువకులు భజన మండళ్లతో హరినామ సంకీర్తనలు చేశారు. ఆలయ పరిసరాలు “జై శ్రీరామ్” నినాదాలతో మార్మోగాయి. కళ్యాణం అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించి, వేలాది మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సేవకులు సేవలందించి కార్యక్రమాలను విజయవంతం చేశారు.
పలు ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించి, శ్రీరాముని విగ్రహాలను ఊరేగించారు. సంప్రదాయ వేషధారణలో కళాకారులు, పిల్లలు పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని, సీతారాముల ఆశీస్సులు పొందారు. గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఆ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular