రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం
- ప్రమాదాలకు దారి తీస్తున్న అక్రమ నిర్మాణం
శంకర్‌పల్లి, మార్చి 31(ప్రజాక్షేత్రం):బుల్కపూర్ గ్రామ పరిధిలో హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఆక్రమణలు కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి తన సొంత భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేపడుతూ రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నాటిన చెట్లను కూడా పలకలతో కంచ వేసి తన ఆధీనంలోకి తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆక్రమణల కారణంగా రహదారి వెడల్పు గణనీయంగా తగ్గిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రమాదాల ముప్పు కూడా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి, రహదారిని మునుపటి స్థితికి తీసుకురావాలని గ్రామస్థులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

