చిన్న పత్రికల సంక్షేమానికి అండగా ఉంటాం
- అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం
- సీఏ సర్టిఫికెట్ సమస్య పరిష్కారానికి కృషి
- మంత్రి, కమిషనర్ లతో పాటు చైర్మన్ దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లాం:విరాహత్ అలీ
హైదరాబాద్ మే 11(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ – చిన్న, మధ్య తరహా పత్రికలు, మ్యాగజైన్స్ ఎడిటర్ల సంక్షేమం కోసం తమ యూనియన్ తల్లిలా అండగా ఉంటుందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీలకు చిన్న, మధ్య తరహా పత్రికల నుంచి సభ్యులుగా నియమితులైన వారిని తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విరాహత్ అలీ మాట్లాడుతూ.. చిన్న పత్రికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు.
చిన్న మధ్య తరహా ప్రతికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ముకుంద్ రెడ్డిలతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. అక్రిడిటేషన్ల జారీలో ఇబ్బందిగా మారిన సీఏ సర్టిఫికెట్ నిబంధనపై సమాచార శాఖ కమిషనర్‌తో చర్చించామని, త్వరలోనే ఈ సమస్య తొలిగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.పెండింగ్ బిల్స్, ప్రతినెలా జారీ చేసే ప్రకటనల విషయంలో సమాచార శాఖ మంత్రి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేద్దామని విరాహత్ అలీ అన్నారు. కమిటీ సభ్యులుగా ఎంపికైన వారు క్షేత్రస్థాయిలో పోరాడి అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు వచ్చేలా చూడాలని సూచించారు. పత్రికల ప్రకటనల పెండింగ్ బిల్లులు త్వరగా విడుదలయ్యేలా ప్రయత్నిస్తున్నామని, ఐకమత్యంతోనే హక్కులను సాధించుకోగలమని పిలుపునిచ్చారు. అనంతరం అక్రెడిటేషన్ కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
యూనియన్ లో చేరిన అగస్టిన్
ఈ కార్యక్రమంలో ‘వుదయం’ దినపత్రిక ఎడిటర్ అగస్టిన్ తిరిగి యూనియన్‌లో చేరగా, ఆయనను విరాహత్ అలీ సాదరంగా ఆహ్వానించి సభ్యత్వాన్ని ఇచ్చారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల సమన్వయకర్త బాలరాజు నేతృత్వంలో జరిగిన ఈ సన్మాన సభలో టియుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైజల్, మధు గౌడ్, హెచ్‌యూజే అధ్యక్షుడు శంకర్, చిన్న పత్రికల సంఘం కోశాధికారి ఆజంఖాన్, రాజిరెడ్డి, దయానంద్, అల్వాల్ హన్మంతు, ఎస్ ఎస్ కె హుస్సేన్, మాతంగి దాస్, దైవాదీనం, బాలకృష్ణ, గోళ్ల రమేష్, ఆమన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

