చీకటిలో శంకర్‌పల్లి రహదారులు ప్రమాదాల పర్వం.. అధికారుల నిర్లక్ష్యం?
- ప్రమాదాలకు బాటలు వేస్తున్న వీధి దీపాల లోపం
శంకర్‌పల్లి, మే 03(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో రాత్రి వేళ రహదారులు చీకటిలో మగ్గుతున్నాయి. ప్రధాన మార్గాలతో పాటు నాలుగు దిక్కులుగా వెళ్లే రోడ్లలో ఒకే దిశలో మాత్రమే వెలుతురు ఉండగా, మిగతా ప్రాంతాలు అంధకారంలోనే ఉండటం ప్రమాదాలకు దారితీస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల రాకపోకలు కష్టంగా మారాయి. ఎదురుగా వచ్చే వాహనాల హైబీమ్ లైట్లు డ్రైవర్లకు ఇబ్బందిగా మారి, ముందున్న దారి స్పష్టంగా కనిపించక ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన వీధి దీపాలు కూడా సరైన విధంగా పనిచేయడం లేదు. కొన్ని చోట్ల రహదారిపై కాకుండా పక్కలకు లేదా స్థంభం కింద మాత్రమే వెలుతురు పడుతుండటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో షాపులు, షోరూమ్‌ల వెలుతురే రహదారికి ఆధారంగా మారింది. ఇటీవల పత్తేపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద కార్లు ఢీకొన్న ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి దీపాల లేమి వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, వీధి దీపాలను మరమ్మతులు చేసి రహదారులపై సరైన వెలుతురు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు జరుగకముందే నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


