బ్రతుకు దెరువు డబ్బా ధ్వంసం…జీవనోపాధి కోల్పోయామని బాధితురాలి ఆవేదన
- జనగాం గ్రామ పంచాయతీపై చాకలి భాగ్యమ్మ ఆరోపణలు
- గ్రామ పంచాయతీ చట్టం, నియమ నిబంధనల ప్రకారమే డబ్బాలను తొలగించాం- జనగాం గ్రామ సర్పంచ్
- గ్రామ పంచాయతీ చట్టం ప్రకారమే 3 నోటీసుల తరువాతనే డబ్బాలను తొలగించాం-పంచాయతీ కార్యదర్శి
- డబ్బాలు వేసుకొన్న స్థలం పూర్తిగా ప్రభుత్వ స్థలం-గ్రామ పంచాయతీ కార్యదర్శి
- న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు చాకలి భాగ్యమ్మ
పెద్దేముల్, మే 09(ప్రజాక్షేత్రం):బ్రతుకు దెరువు కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న డబ్బాను గ్రామ పంచాయతీ అధికారులు జేసీబీ సహాయంతో పూర్తిగా ధ్వంసం చేశారని, దీంతో జీవనోపాధి కోల్పోయామని బాధితురాలు చాకలి భాగ్యమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి జనగాం గ్రామానికి చెందిన బాధితురాలు చాకలి భాగ్యమ్మ తెలిపిన వివరాల ప్రకారం…. పెద్దేముల్ మండల పరిధిలోని జనగాం గ్రామంలో చాకలి భాగ్యమ్మ,ఆమె భర్త చాకలి నర్సింహులు కలిసి 2019లో సుమారు 7 సంవత్సరాల క్రితం గ్రామంలో ల్యాండ్రి షాపుతోపాటు కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.అయితే ఇటీవల కొన్ని నెలల క్రితం జనగాం గ్రామాన్ని అప్పటి వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్ సందర్శించారు. ఆ సమయంలో కొందరు గ్రామస్తులు అప్పటి అదనపు కలెక్టర్ సుధీర్ కు పాఠశాల సమీపంలో, మిషన్ భగీరథ నీటి ట్యాంకు వద్ద ఉన్న డబ్బాల కారణంగా మద్యం సేవించడం, చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయడం జరుగుతోందని,దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించి అదనపు కలెక్టర్ స్పందిస్తూ పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆ డబ్బాలను గ్రామ పంచాయతీ నియమనిబంధనలు,చట్ట ప్రకారం చర్యలు తీసుకొని డబ్బాలను అక్కడి నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా గ్రామ పంచాయతీ అధికారులు అప్పట్లో చాకలి భాగ్యమ్మ దుకాణం డబ్బాకు సంబంధించి ఆమె భర్త చాకలి నర్సింహులు పేరుతో ఫిబ్రవరి 19,2026 నాడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 96 మరియు జీవోఎంఎస్ నెం.550 ప్రకారం పంచాయతీ రాజ్ మరియు గ్రామాభివృద్ధి శాఖ తేది: 03/12/1999 ప్రకారం ఏ వ్యక్తి కూడా గ్రామపంచాయతీ స్థలమును తదితర ప్రాంతాలను ఆక్రమించకూడాదని నిర్దేశిస్తూ ఫారం-02 ద్వారా మొదటి నోటీసును జారీ చేశారు. అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 113 మరియు 114 జీవోఎంఎస్ నెం.67
(పీఆర్అండ్ఆర్డీ) ప్రకారం మార్చి 26,2026 నాడు రెండవ నోటీసును, మార్చి 31,2026 నాడు మూడవ నోటీసును ఇలా మొత్తం 3 నోటీసులను జారీ చేశారు. అయితే తమ కుటుంబానికి మా నాన్న చాకలి ఎల్లప్ప పేరుమీద అప్పట్లో ప్రభుత్వం 1997లో ఫారం-డి, ఫైల్ నెం, బి/413/1997 ద్వారా జనగాం గ్రామంలో స్థలం కేటాయించిందని, ఆ స్థలంలోనే జీవనోపాధి కోసం కులవృత్తి ల్యాండ్రి మరియు కిరాణ షాపును 2019 సంవత్సరంలో ప్రారంభించి జీవనం కొనసాగిస్తున్నామని చాకలి భాగ్యమ్మ కుటుంబం పేర్కొంది. ఈ మధ్య నూతనంగా ఏర్పడిన జనగాం గ్రామ పంచాయతీ పాలకవర్గం వారు అట్టి స్థలమును అక్రమంగా ఆక్రమించారని తెలియజేస్తూ నోటీసులు జారీ చేశారని వివరిస్తూ ఇందుకు సంబంధించిన పత్రాలు, పంచాయతీ ట్యాక్స్ రసీదులు కూడా తమ వద్ద ఉన్నాయని చెబుతూ పెద్దేముల్ మండల ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఇదే ఫిర్యాదును గ్రామ పంచాయతీ కారోబార్ కు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల గ్రామ పంచాయతీ అధికారులు జనగాం గ్రామంలో బాధితురాలు చాకలి భాగ్యమ్మకు సంబంధించిన ల్యాండ్రి మరియు కిరాణ షాపును జేసీబీ సహాయంతో పూర్తిగా డబ్బాను ధ్వంసం చేసి అక్కడి నుండి తొలగించారు. ఇదే విషయమై చాకలి భాగ్యమ్మ శనివారం మీడియా ముందు తన గోడును వెల్లబోసుకుంటూ…జనగాం గ్రామంలో సుమారు 7 సంవత్సరాల నుండి బ్రతుకుదెరువు కోసం ల్యాండ్రి మరియు కిరాణ దుకాణం పెట్టుకున్నామని, దుకాణానికి సంబంధించి గ్రామ పంచాయతీలో ట్రేడ్ లైసెన్సు పొంది లైసెన్సు ఫీజులు కూడా కట్టుకున్నామని వాపోయారు. మేము పెళ్ళికి వెళ్ళింది చూసి మాకు చెప్పకుండా మా దుకాణం డబ్బాను పూర్తిగా జేసీబీ సహాయంతో ధ్వంసం చేసి కూల్చివేశారని ఆరోపించారు. తాము జనగాం గ్రామ పంచాయతీ పరిధిలో ఏ స్థలాన్ని ఆక్రమించలేదని, ఎక్కడ కూడా అక్రమించి ఇండ్ల నిర్మాణాలు, అక్రమంగా కట్టడాలు కట్టలేదని కేవలం బ్రతుకు దెరువు కోసమే డబ్బాను పెట్టుకున్నామని అన్నారు.డబ్బా తొలగింపు సమయంలో డబ్బాలో ఉన్న సామాగ్రి ధ్వంసమైందని, టెంట్ హౌజ్ కు సంబంధించిన రూ.1 లక్ష 50 వేల నగదును కూడా కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే మేమే డబ్బాను తొలగించేవాళ్ళం, కానీ ఏలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా పీకేసీ సామాన్లన్నీ బజార్లో పడేశారని ఆరోపిస్తూ వాపోయారు. గ్రామ పంచాయతీలో ట్రేడ్ లైసెన్సు తీసుకుని ఫీజులు కూడా చెల్లిస్తున్నామని అయినా అన్యాయంగా వ్యహరించారంటూ చాకలి భాగ్యమ్మ మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై ఈ నెల 6న పెద్దేముల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు. ప్రస్తుతం జీవనోపాధి కోల్పోయి మా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జనగాం గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరణ
నేను జనగాం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరి సుమారుగా 1 నెల మాత్రమే అయిందని, గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ నియమనిబంధనల ప్రకారం డబ్బాలను కొనసాగిస్తున్న వారికి 3 నోటీసులు జారీ చేయడం జరిగిందని అన్నారు. గ్రామ సర్పంచ్ నోటీసులు ఇచ్చిన తరువాత కూడా డబ్బాల యజమానులకు చాలా సమయం ఇచ్చారు. అయినా వాళ్ళు డబ్బాలను తీయలేదు. వారు డబ్బాలను పెట్టుకొన్న స్థలం పూర్తిగా ప్రభుత్వ స్థలం (భూమి), కాబట్టి పోలీసుల సాయంతో సర్పంచ్ సమక్షంలో తాము డబ్బాలను గ్రామ పంచాయతీ చట్టం ప్రకారమే తొలగించామని వివరణలో పేర్కొన్నారు.
జనగాం గ్రామ సర్పంచ్ వివరణ
గతంలో ఉన్న వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు జనగాం గ్రామంలో స్కూల్, మిషన్ భగీరథ ట్యాంక్ పరిసరాల్లో ఉన్న డబ్బాలు కొనసాగిస్తున్న యజమానులకు 3 నోటీసులు జారీ చేయడం జరిగిందని,వారికి డబ్బాలు తీసివేయడానికి కూడా సమయం ఇచ్చామని అన్నారు. గ్రామ పంచాయతీ చట్ట ప్రకారం 3 నోటీసులను కూడా ఇచ్చామని అన్నారు.సుమారు 20 రోజుల క్రితం డబ్బాల యజమానులకు డబ్బాలలోని సామాన్లు తొలగించాలని,డబ్బాలను అక్కడి నుండి తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా,అదే విధంగా తానే స్వయంగా ఇంటికి పిలిపించి చెప్పడం జరిగిందని, రూల్ ప్రకారం నోటీసులు జారీ చేశాక తీసేయాలని,కానీ వాళ్లు తీసేయలేదని అన్నారు.మరోమారు వారం రోజుల క్రితం మాట్లాడి గత సోమవారం ఉదయం 10 గంటల వరకు డబ్బాలను,డబ్బాలలో ఉన్న సామాన్లను తొలగించాలని ఇద్దరు యజమానులకు చెప్పడం జరిగిందని,చాకలి నర్సింహులు ఇంటికి గ్రామ పంచాయతీ వర్కర్లను పంపించి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని అన్నారు.దానికి వాళ్ళు డబ్బాలను తొలగించకపోవడంతో గ్రామ పంచాయతీ చట్ట ప్రకారం,రూల్ ప్రకారం, పూర్తి స్థాయి గ్రామ పంచాయతీ నియమ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకొని డబ్బాలను తొలగించడం జరిగిందని జనగాం గ్రామ సర్పంచ్ వివరణలో పేర్కొన్నారు.


