కుప్పంలో జలహారతి.. తెలంగాణలో రైతుల కన్నీటి ఆర్తి
వనపర్తి, సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):శ్రీశైలం నుంచి 672 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణా జలాలు కుప్పం ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్యక్రమానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించాల్సిన జలహారతి కార్యక్రమం మంగళవారానికి వాయిదా పడింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు చెందిన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల రైతులకు మాత్రం సాగునీరు అందడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఈ వివరాలపై సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో 123.64 కిలోమీటర్ల పొడవైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటిని హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ నీటితో కుప్పం నియోజకవర్గంలోని 110 చిన్నతరహా నీటిపారుదల చెరువుల ద్వారా 6,300 ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు కుప్పం, పలమనేరు ప్రాంతాల్లోని 4.02 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారని వివరించారు.
పక్కనే కృష్ణా.. పాలమూరుకు నీళ్లేవీ?
కృష్ణా నదికి సమీపంలో ఉన్న పాలమూరు పల్లెలకు మాత్రం కృష్ణా జలాలు అందడం లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు సరఫరా చేయకపోవడంతో మోటార్లు పనిచేయడం లేదని, ఫలితంగా రైతుల పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. జూరాల నుంచి నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
ఎల్‌నినో పేరుతో పంట విరామమా?
ఎల్‌నినో ప్రభావం పేరుతో తెలంగాణలో పంటల విరామాన్ని ప్రకటించిన పరిస్థితి ఏర్పడిందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఒకవైపు తెలంగాణ రైతులకు సాగునీరు అందకుండా ఇబ్బందులు ఎదురవుతుండగా.. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, వెలిగొండ మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు.
చెరువులు నింపకుండా.. నీటి తరలింపా?
కృష్ణా నది పక్కనే ఉన్న తెలంగాణ ప్రాంతాల్లోని చెరువులకు నీరు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆయన అన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన నేతలకు గృహ నిర్బంధాలు తెలంగాణలో రైతులకు సాగునీరు అందించాలని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధాలకు గురిచేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైన తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నీటి తరలింపును అడ్డుకోవడంలోనూ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలు, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

