- బాధ్యతాయుత పాలనతో అభివృద్ధి దిశగా తెలంగాణ
- ప్రజాపాలన దినోత్సవంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
- విశ్వకర్మ జయంతి వేడుకల్లోనూ పాల్గొన్న ముఖ్యఅతిథి
వనపర్తి, సెప్టెంబరు 17(ప్రజాక్షేత్రం):ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అజెండాతో ప్రజలకు బాధ్యతాయుత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వనపర్తి ఐడీఓసీ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు శాఖ నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ప్రజల సంక్షేమమే పాలనకు ప్రాతిపదిక
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 1948 సెప్టెంబరు 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజని అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చిన రోజుగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖలు సాధించిన పురోగతిని ఆయన వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే వంటగ్యాస్, వడ్డీలేని రుణాలు, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, ఆసరా పింఛన్లు వంటి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు. జిల్లాలో మహిళలు ఇప్పటి వరకు 3.84 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.161.16 కోట్లు భరించిందన్నారు. రూ.500కే వంటగ్యాస్ పథకం కింద 85,383 మందికి 5,12,439 సిలిండర్లు అందించి రూ.15.71 కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
రైతు భీమా కింద 2025–26లో 702 మంది రైతుల కుటుంబాలకు రూ.35.10 కోట్లు అందించామని, రైతు భరోసా కింద 2026 వానాకాలంలో 1,82,768 మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.212.32 కోట్లు జమ చేసినట్లు వివరించారు.
కర్నేతండా ఎత్తిపోతల పథకాన్ని రూ.76.19 కోట్లతో పూర్తి చేసి ప్రారంభించామని, దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లోని చెరువులను నింపి 4,235 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
విద్య.. వైద్య రంగాల్లో పురోగతి
జిల్లాలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల మంజూరై పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.47.50 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి రూ.203.95 కోట్లు, పెబ్బేరులో రూ.11.20 కోట్లు, ఆత్మకూరులో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రానికి రూ.22 కోట్ల అంచనా వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 50 పడకల అత్యవసర చికిత్సా విభాగం ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి
రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 12,851 దరఖాస్తులు అందగా 11,403 పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణిని జిల్లా స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్, మండల స్థాయికి విస్తరించినట్లు వివరించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలో 2,221 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, ఏహెచ్‌టీయూ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడు
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లోనూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడని అన్నారు. హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదంలో విశ్వకర్మను సృష్టికర్తగా పరిగణిస్తారని తెలిపారు. చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొన్నారు. సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి
వనపర్తి జిల్లా అభివృద్ధిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, పాత్రికేయులు సమన్వయంతో పనిచేయాలని మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎస్పీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, వినోద్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


