గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం
- సత్యం, అహింస, స్వావలంబనతోనే సమాజ ప్రగతి
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగాగాంధీ జయంతి
వనపర్తి, అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం):సత్యం, అహింస, స్వావలంబన వంటి మహాత్మా గాంధీ ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని భాజపా జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి.నారాయణ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అహింస, సత్యాగ్రహాన్ని ప్రధాన ఆయుధాలుగా చేసుకుని ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చారని తెలిపారు. చంపారన్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం, అసహకార ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం వంటి పోరాటాల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమానికి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవ, పరిశుభ్రత, సామాజిక బాధ్యత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ఆయన సిద్ధాంతాలు భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తోందని గుర్తుచేశారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్వచ్ఛత, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛత, స్వావలంబన, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని డి.నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్.లోకనాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చు రాము, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాషే శీను, జిల్లా కన్వీనర్ బంకలి సుబ్రమణ్యం, కౌన్సిలర్ విజయసాగర్, నాయకులు సూగూరు రాములు, ఎం.డి.ఖలీల్, రాయనసాగర్ తిరుపతయ్య, యాదవ్, చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.

