మంగళపల్లి రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం కలకలం!
- న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో అధికారుల తనిఖీలు
- 829 బస్తాలు మిల్లులో.. మరో 51 బస్తాలు లారీలో గుర్తింపు.
- అక్రమ కొనుగోళ్లు, నిల్వలపై విచారణకు సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు.
రంగారెడ్డి జిల్లా,అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారనే ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మిల్లులో 829 బియ్యం బస్తాలతోపాటు, అక్కడికి వచ్చిన లారీలో మరో 51 బస్తాలను గుర్తించినట్లు అధికారుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొత్తం 880 బస్తాలు గుర్తింపు
ఈ నెల 20న ఉదయం సుమారు 8.30 గంటలకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిల్లులో 50 కిలోల బరువున్న 677 బస్తాలు, 25 కిలోల బరువున్న 101 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన టాటా లారీ (నంబరు టిఎస్ 03 యుబి-3399)లో 50 కిలోల బరువున్న మరో 51 బస్తాలు ఉన్నట్లు తెలిపారు. బియ్యం నమూనాలను సేకరించి సాంకేతిక అధికారులతో పరీక్షించగా, వాటిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్‌ఆర్‌కే) ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
ముగ్గురి పాత్రపై విచారణకు విజ్ఞప్తి
న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్ యజమాని గీతేష్ బన్సల్ వాంగ్మూలం ప్రకారం.. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం మోతే గ్రామ పరిధిలోని భారతి ఇండస్ట్రీస్ నుంచి బియ్యం కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సరఫరా, కొనుగోలు పత్రాలను పరిశీలించారు. తెలంగాణ పీడీఎస్ రైస్ (కంట్రోల్) ఆర్డర్–2016లోని క్లాజ్ 17(e) ఉల్లంఘన జరిగినట్లు ఆరోపిస్తూ సివిల్ సప్లైస్ అధికారులు ఫిర్యాదు చేశారు. న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్ యజమాని గీతేష్ బన్సల్, బియ్యం సరఫరాకు సంబంధించి పేర్కొన్న శ్రీరామ్ లోహియా, భారతి ఇండస్ట్రీస్ యజమాని కపర్తి నాగభూషణం తదితరుల పాత్రపై విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

