Homeతెలంగాణహైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు!

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు!

  • వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మహిళా జర్నలిస్టులు హాజరు
  • నిర్భయంగా ప్రశ్నించే గొంతుకలను అణచివేయలేరు:మంత్రి సీతక్క
  • ప్రజాస్వామ్య పరిరక్షణ, అణగారిన వర్గాల గొంతుకను బలంగా వినిపించడంలో మహిళా జర్నలిస్టుల పాత్ర కీలకం: విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.రాధారాణి
  • మహిళలలు నిర్భయంగా నేతృత్వం వహించాలి: మల్కాజిగిరి కమిషనర్ సుమతి

హైదరాబాద్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడంలో, సమాజంలో అణగారిన వర్గాల గొంతుకను బలంగా వినిపించడంలో మహిళా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మెఫీ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని టూరిజం ప్లాజా హోటల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా పాత్రికేయులు హాజరయ్యారు. జాతీయ సెమినార్ ప్రారంభోత్సవ సభలో రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు జస్టిస్ జి. రాధారాణి, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి (ఐపీఎస్), తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, కర్ణాటక మీడియా అకాడమీ చైర్‌పర్సన్ ఆయేషా ఖానమ్, ఐ జె యు స్టీరింగ్ కమిటీ సభ్యులు డి.అమర్, ఎస్.ఎన్.సిన్హా, ఐజేయు అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, సెక్రెటరీ జనరల్ డి.సోమసుందర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్టులు స్వప్న, టీయూడబ్ల్యూజే మహిళా విభాగం కన్వీనర్ రాజేశ్వరి కళ్యాణం, అత్తలూరి అరుణ, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నిజాలను నిగ్గుతేల్చడమే జర్నలిజం కర్తవ్యం: జస్టిస్ రాధారాణి

సదస్సులో జస్టిస్ జి. రాధారాణి కీలక ఉపన్యాసం చేస్తూ… జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని . స్వతంత్ర పత్రికారంగం లేకుండా ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వమే పత్రికారంగానికి ప్రాణవాయువని, నిష్పాక్షికమైన వాస్తవాలను సమాజం ముందుంచడమే జర్నలిస్టుల కర్తవ్యమని అన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రసాదిస్తే, అధికరణ 19(2) బాధ్యతాయుతమైన పరిమితులను నిర్దేశించిందని గుర్తుచేశారు. డిజిటల్ మాధ్యమాలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో అసత్య ప్రచారాలు, డీప్‌ఫేక్, ఏఐ సాంకేతికత వల్ల విశ్వసనీయతకు ముప్పు వాటిల్లుతోందని, వాస్తవాల పరిశీలన (ఫ్యాక్ట్ చెకింగ్) ఎంతో అవసరమని సూచించారు. కార్యాలయాల్లో పని ప్రదేశ వేధింపుల నిరోధక (పోష్) చట్టాన్ని మీడియా సంస్థలు పక్కాగా అమలు చేయాలని, మహిళా జర్నలిస్టులకు తగిన రక్షణ, వృత్తిపరమైన సమాన అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.

ప్రశ్నించే హక్కును ఎవరూ కాలరాయలేరు: మంత్రి సీతక్క

రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ… భయంతో ఏ మహిళా తన గొంతును నొక్కేసుకోకూడదని స్పష్టం చేశారు. చేతిలో మైక్ పట్టుకున్న మహిళ శత్రువు కాదని, సమాజ హితం కోసం నిలదీసే పాత్రికేయులు వ్యవస్థకు ఎన్నటికీ ముప్పు కారని ఆమె ఉద్ఘాటించారు. “మహిళల ప్రగతిని బట్టే ఆ సమాజ ప్రగతి ఆధారపడి ఉంటుందని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. మేం రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసమే పోరాడుతున్నాం తప్ప, ఎవరి భిక్షనూ కోరడం లేదు” అని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, వ్యక్తిత్వ హననం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం మహిళా జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

న్యాయం కోసం నిలబడే శక్తి మహిళలకుంది: ఐపిఎస్ సుమతి

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి (ఐపీఎస్) మాట్లాడుతూ… మహిళలు ప్రతి సమస్యను సమగ్ర కోణంలో విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉంటారని, వారు కేవలం డెస్క్‌లకు మాత్రమే పరిమితం కాకుండా ఫీల్డ్ రిపోర్టింగ్‌లో ముందుండి నిర్భయంగా, నేతృత్వం వహిస్తూ ప్రజాస్వామ్యానికి సరికొత్త దిశానిర్దేశం చేయాలని కోరారు.మహిళలు అన్నిoటిని అధిగమిస్తేనే ముందుకు వచ్చే పరిస్థితులు వుంటాయని వివరించారు. వివిధ రంగాలలో మహిళలు రాణించడం సాధారణ విషయం కాదని, అనేక అవాంతరాలను అధిగమించాల్సి ఉంటుంది అని చెప్పారు.

కర్ణాటక మీడియా అకాడమీ చైర్‌పర్సన్ ఆయేషా ఖానమ్ మాట్లాడుతూ… న్యూస్‌రూమ్‌లలో మహిళా జర్నలిస్టులు తమ ప్రాధాన్యాన్ని నిరూపించుకోవాలని, సానుభూతితో కూడిన మానవీయ కథనాలను సమాజానికి అందించాలని పేర్కొన్నారు. అంతకుముందు ఐజేయూ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్ము ప్రారంభోపన్యాసం చేస్తూ క్షేత్రస్థాయిలో మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను వివరించారు. ఇటీవల రీతిక చోప్రా వంటి జర్నలిస్టులు ఎన్నికల సంఘం, ఎస్ ఐ ఆర్ గురించి నిర్భయంగా కథనాలు రాసారని గుర్తు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular