- సొంత ఖర్చులతో క్రీడా దుస్తులు అందించిన తాళ్ల నవీన్ గౌడ్
రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలంలోని నాగర్‌గూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ తాళ్ల నవీన్ గౌడ్ తన సొంత ఖర్చులతో క్రీడా దుస్తులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాబాద్ మండల విద్యాధికారి డి. లక్ష్మణ్ హాజరై విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాధికారి డి. లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదలతో పాటు జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ తన సొంత ఖర్చులతో క్రీడా దుస్తులు అందించిన తాళ్ల నవీన్ గౌడ్‌ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ప్రోత్సాహానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ షాబాద్ మండల అధ్యక్షుడు టి. డేవిడ్ రెడ్డి, ఉపాధ్యాయులు సంగమేశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి జెడ్పీహెచ్ఎస్ తాళ్లపల్లి రమేష్ జెడ్పీహెచ్ఎస్ పోతుగల్ యువజన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ క్రీడా దుస్తులు విరాళంగా అందించిన తాళ్ల నవీన్ గౌడ్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. కృష్ణ, ఉపాధ్యాయురాలు మంజుల, విద్యార్థులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.

