- వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆరోపణ.
- సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి!
- ఎమ్మార్పీఎస్ కొందుర్గ్ మండల సీనియర్ నాయకులు ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ.
కొందుర్గ్ అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన మల్లని రమేష్ కుమార్, రాధా దంపతులు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లగా, చివరకు తల్లి, కడుపులోని బిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. బాధితురాలి భర్త రమేష్ కుమార్ ఆరోపణల ప్రకారం.. తొలుత కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వారికి షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లిన తర్వాత వైద్య సిబ్బంది సకాలంలో స్పందించలేదని, సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకెళ్లగా, అప్పటికే తల్లీబిడ్డ ఇద్దరూ మరణించినట్లు వైద్యులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల ప్రాణాలకు భరోసా లేదా?
ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముకుని వచ్చే పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్యం అందకపోతే వారి ప్రాణాలకు రక్షణ ఎక్కడ? ఒక నిండు ప్రాణం, పుట్టబోయే బిడ్డ ప్రాణం కోల్పోవడం వెనుక ఏం జరిగింది? ఎవరి నిర్లక్ష్యం ఉంది? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం ఉంది.
- ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలి.
- వైద్య సిబ్బంది నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలి.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ మహిళలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్య వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాలి.
ఒక పేద కుటుంబానికి జరిగిన ఈ తీరని నష్టంపై ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నాం. పేదవాడి ప్రాణం కూడా విలువైనదే.. ప్రభుత్వ వైద్యం పేదలకు భరోసా కల్పించాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలి అని అన్నారు.


