పెద్దపల్లి నవంబర్ 07(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ దాడికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకులంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై నలుగురు తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బ్లాంకెట్ విషయంలో మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థి వీపు, ముఖంపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థికి ప్రిన్సిపాల్ ప్రథమ చికిత్స అందించారు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై ఎంబడి శ్రీకాంత్ నలుగురు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురుకులాల్లో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

