- చెవుల బిక్షపతి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న ఆగిరాల గ్రామ యువకులు.
- మహనీయుల విగ్రహాల గౌరవాన్ని కాపాడాలి!
- మహనీయుల విగ్రహాలకు అడ్డుగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని నిలిపివేయాలి
- ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు పెంటనోళ్ళ నర్సింహా మాదిగ.
షాద్ నగర్ నవంబర్ 15(ప్రజాక్షేత్రం):ఆగిర్యాల గ్రామంలో మహనీయుల విగ్రహాలు ఉన్న ప్రదేశానికి అడ్డంగా గ్రామపంచాయతీ భవన నిర్మాణం చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ గ్రామంలో దళితులు ప్రతి సంవత్సరం మహనీయుల జాతరను ఘనంగా నిర్వహిస్తారు. అలాంటి మహనీయుల విగ్రహాలకు అడ్డుగా నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో జాతరలు నిర్వహించడానికి, మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామ యువకులు, ప్రజా సంఘాల నాయకులు గ్రామపంచాయతీ నుంచి జిల్లా కలెక్టర్ వరకు, ఆర్డీఓ, తహసీల్దార్, పోలీసు అధికారుల వరకు అనేక వినతిపత్రాలు అందించారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోవడం బాధాకరం.
వీర్లపల్లి శంకర్ అన్నా.. మీకు మా ప్రత్యేక విజ్ఞప్తి!
మీరు షాద్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు, సంచార జాతుల పిల్లల కోసం పాఠశాల నిర్మాణం వంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కానీ ఆగిర్యాల గ్రామంలో జరుగుతున్న ఈ సమస్యపై మీకు కొందరు నాయకులు తప్పుడు సమాచారం అందిస్తూ ఉండవచ్చని మా అనుమానం. దయచేసి ఎవరో చెప్పిన మాటలను మాత్రమే నమ్మకుండా, ఒక్కసారి మీరు స్వయంగా ఆగిర్యాల గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించండి. ప్రజలకు ఉపయోగపడే గ్రామపంచాయతీ భవనం విశాలంగా ఉండాలి. గ్రామసభలు నిర్వహించుకోవడానికి, సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశాలు జరుపుకోవడానికి, గ్రామ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. కానీ ప్రస్తుతం నిర్మిస్తున్న స్థలం అందుకు అనుకూలంగా లేదని గ్రామ యువకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో విజయ డెయిరీ ప్రాంతం, పాత గ్రామపంచాయతీ స్థలం వంటి ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి గ్రామపంచాయతీ భవనాన్ని మరోచోట నిర్మించవచ్చని యువకులు సూచిస్తున్నారు. ఎమ్మెల్యే గారు మీరు ఒక పార్టీకి, ఒక వ్యక్తికి మాత్రమే ఎమ్మెల్యే కాదు. షాద్నగర్ ప్రజలందరికీ ఎమ్మెల్యే. కాబట్టి ఒక వ్యక్తి ప్రయోజనం కోసం కాకుండా ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఈ పోరాటాన్ని ఒక పార్టీకి, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా చూడకండి. ఇది మహనీయుల విగ్రహాల గౌరవం కోసం, దళితుల ఆత్మగౌరవం కోసం, భావితరాల హక్కుల కోసం చేస్తున్న పోరాటం. మీరు షాద్నగర్లో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవిస్తున్నట్లుగానే, ఆగిర్యాల గ్రామంలో కూడా మహనీయుల విగ్రహాల గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాం.
మా ప్రధాన డిమాండ్లు:
- మహనీయుల విగ్రహాలకు అడ్డుగా జరుగుతున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి.
- ఎమ్మెల్యే స్వయంగా ఆగిర్యాల గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించాలి.
- గ్రామ ప్రజలు సూచించిన ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలి.
- ప్రజల అభిప్రాయాలను గౌరవించి గ్రామపంచాయతీ భవన నిర్మాణ స్థలాన్ని మార్చాలి.
- మహనీయుల విగ్రహాలు, జాతరలు, దళితుల ఆత్మగౌరవానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి.
ఎమ్మెల్యే మా విజ్ఞప్తిని రాజకీయ కోణంలో చూడకుండా సామాజిక న్యాయం, ప్రజల హక్కుల కోణంలో చూడండి. మీ నాయకత్వంపై మాకు నమ్మకం ఉంది. మీరు స్వయంగా గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.
లేకపోతే ఈ సమస్యపై మండలంలోని ప్రతి మాదిగ పల్లెను ఏకం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుంది. ఈ కార్యక్రమంలో కొందుర్గ్ మండల ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ, కొందుర్గు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గూడెం చెన్నయ్య మాదిగ, కొందుర్గు మండల ప్రధాన కార్యదర్శి గోపి అనంత రాములు మాదిగ, మొగిలిగిద్దా నందు మాదిగ, గొర్లకడి శ్రీనివాస్ మాదిగ, ఆనేగాళ్ళ నర్సిములు మాదిగ, సతీష్ మాదిగ, విక్రమ్ మాదిగ, సుదర్శన్ మాదిగ, నగేష్ మాదిగ, భీమయ్య మాదిగ, చేదురువల్లి రమేష్ మాదిగ, యాదగిరి మాదిగ, రాకేష్ మాదిగ, గణేష్ మాదిగ, యాదయ్య మాదిగ, నరేష్ మాదిగ, శ్రీను మాదిగ, శ్యామ్ సుందర్ మాదిగ, జగన్, మల్లేష్, రమేష్, రాజు, మరియు గ్రామ యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

