- కీసరలో ట్రాఫిక్ కష్టాలు..ట్రాఫిక్ నియంత్రణ ఏదీ?
కీసర, నవంబర్ 15(ప్రజాక్షేత్రం):మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో ట్రాఫిక్ సమస్య వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో తరచూ రాకపోకలు స్తంభిస్తున్నాయి. సాధారణ సమయాల్లోనే వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంటుండగా.. అత్యవసర సేవలకూ ఈ సమస్య అడ్డంకిగా మారుతోంది. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాల్సిన అగ్నిమాపక వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మంటలను అదుపు చేయడంలో జరిగే ఆలస్యం ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో రహదారులపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రద్దీ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అత్యవసర సమయాల్లో అగ్నిమాపక, అంబులెన్సు వాహనాలకు తక్షణమే దారి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

