- సర్కారు భూమి కబ్జాకు రాజకీయ అండదండ-డబ్బులు తీసుకొని పాఠశాలకు కాపలా!
- ఇప్పలపల్లి భూ దోపిడీలో రాజకీయ కోణం-అధికారులతో కుమ్మక్కై కబ్జాకు తెరలేపిన నేత ఎవరు?
- ప్రైవేట్ పాఠశాల ముసుగులో భూ కబ్జా-వెనుక ఉండి నడిపిస్తున్న రాజకీయ నాయకుడు ఎవరు?
- ఇప్పలపల్లి కబ్జా కథకు సూత్రధారి ఒక రాజకీయ నాయకుడు-డబ్బులిస్తే చాలు.. సర్కారు భూమి స్వాహా!
- ఇప్పలపల్లిలో సర్కారు భూమి కబ్జా వెనుక రాజకీయ నాయకుడి పాత్ర-మామూళ్ల మతలబు బట్టబయలు!
భూపాలపల్లి ప్రతినిధి, నవంబర్ 15(ప్రజాక్షేత్రం):జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లిలో సంచలనం సృష్టిస్తున్న రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వెనుక కేవలం కబ్జాదారుడే కాదు, ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందనే విషయం ఇప్పుడు బయటపడింది. గ్రామస్తులు ఆరోపిస్తున్న ప్రకారం..శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకుడు గ్రామంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ప్రహరీ గోడ, ఇల్లు, ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకులు, మరుగుదొడ్లు నిర్మిస్తుంటే, అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనికి కారణం ఆ కబ్జాదారుల దగ్గర నుండి ఒక రాజకీయ నాయకుడు భారీగా డబ్బులు తీసుకొని, ఆ పాఠశాల నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి, అధికారులను మేనేజ్ చేస్తున్నాడు.
డబ్బులు తీసుకొని కబ్జాకు కాపలా!
పంచాయతీ కార్యదర్శులు నోటీసులు ఇచ్చి మమ అనిపించడం, ఎస్సారెస్సీ, ఆర్ అండ్ బి అధికారులు సర్వే చేసి వెళ్లిపోవడం వెనుక ఈ రాజకీయ నాయకుడి హస్తం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. డబ్బులు తీసుకోవడం వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఆ రాజకీయ నాయకుడే కబ్జాదారులకు అండగా నిలబడి నిర్మాణాలు చేయిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల పేరుతో అడ్డగోలు దందా
ప్రభుత్వ భూమిని కొట్టేసి, దానిలో ప్రైవేట్ పాఠశాల నడుపుతూ, చట్టాన్ని, ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇదంతా ఆ రాజకీయ నాయకుడి అండ చూసుకునేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. “రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుంటే, ఇప్పలపల్లిలో మాత్రం ఒక రాజకీయ నాయకుడు డబ్బులు తీసుకొని సర్కారు భూమిని దోచిపెడుతున్నాడు. వెంటనే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి, ఆ రాజకీయ నాయకుడిపై, అతనికి సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని కాపాడాలి. ఆ పాఠశాల అక్రమ కట్టడాలను తొలగించాలి” అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


