- ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం విస్మరించొద్దు – ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలి
వలిగొండ, నవంబర్ 15(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, నిర్బంధాలు, పోలీసుల లాఠీ దెబ్బలు, జైలు జీవితాలను సైతం అనుభవించిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన గుర్తింపుతో పాటు రివార్డులు అందించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగిశెట్టి క్రిస్టఫర్ డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను, ఆర్థిక స్థితిగతులను సైతం లెక్కచేయకుండా పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దేశ చరిత్రలోనే ఒక గొప్ప ప్రజా పోరాటమని, అనేకమంది త్యాగాలు, పోరాటాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని పేర్కొన్నారు.ఉద్యమకారుల సేవలను గుర్తించడంలో ప్రభుత్వం మరింత జాప్యం చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని కోరారు. అర్హులైన ఉద్యమకారుల వివరాల సేకరణకు ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించి, పారదర్శకంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులకు గౌరవం, తగిన ప్రతిఫలం అందించడం ద్వారా వారి త్యాగాలకు నిజమైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ ప్రకటనలో రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి, ఉపాధ్యక్షులు కొండాపురం శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ములుగు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

