- రజత పతకం సాధించిన దేగాం గ్రామ యువ క్రీడాకారుడు భాలేకర్ క్రితిక్ కుమార్
నిర్మల్ జిల్లా ప్రతినిధి నవంబర్ 24(ప్రజాక్షేత్రం):భైంసా, సబ్‌జూనియర్ వుషు ఛాంపియన్‌షిప్-2026 పోటీల్లో నిర్మల్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన భాలేకర్ సుధీర్ కుమారుడు భాలేకర్ క్రితిక్ కుమార్ రజత పతకం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆదిలాబాద్ జిల్లా అమెచ్యూర్ వుషు అసోసియేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ అమెచ్యూర్ వుషు అసోసియేషన్ పర్యవేక్షణలో ఆదిలాబాద్‌లోని బజరంగ్ ఫంక్షనల్ హాల్‌లో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో అండర్-14 గ్రూప్-బి విభాగంలో క్రితిక్ కుమార్ (గన్‌షు) పోటీలో ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కఠోర సాధన, పట్టుదలతో పోటీల్లో రాణించి గ్రామానికి, జిల్లాకు పేరు తీసుకురావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా నుంచి పాల్గొన్న అవుల ప్రణీత్ అండర్-11 గ్రూప్-సి విభాగంలో తైజిచువాన్ పోటీలో రజత పతకం సాధించగా, యార్గట్ల రుత్విక్ అండర్-14 గ్రూప్-బి విభాగంలో (దావోషు) పోటీలో రజత పతకం గెలుచుకున్నాడు. మొత్తంగా నిర్మల్ జిల్లా క్రీడాకారులు మూడు రజత పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విజేతలను క్రీడాభిమానులు, గ్రామస్థులు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

