📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఫుట్‌పాత్ మాయం…ప్రజల ప్రాణాలతో ఆట!

ఫుట్‌పాత్ మాయం…ప్రజల ప్రాణాలతో ఆట!

📰 Generate e-Paper Clip

ఫుట్‌పాత్ మాయం…ప్రజల ప్రాణాలతో ఆట!

-ఫుట్‌పాత్ సమస్యపై గాజులరామారం సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం–ట్రాఫిక్ పోలీసుల చర్యలు

-హాస్పిటల్ జోన్‌లోనే నిర్లక్ష్యం…గాజులరామారం సర్కిల్ అధికారులు ఎక్కడ?

-జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసుల చర్యలు ఉన్నా…గాజులరామారం సర్కిల్ స్పందన ఎక్కడ?

-రోజూ తనిఖీలు చేస్తేనే మార్పు…స్థానికుల డిమాండ్

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):ఫుట్‌పాత్ అనేది కేవలం నడిచే దారి మాత్రమే కాదు…అది నగర నాగరికతకు అద్దం. నగరాల్లో పాదచారుల భద్రతకు కీలకమైన ఫుట్‌పాత్‌లు ఇక్కడ పూర్తిగా కనుమరుగైపోయాయి. కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నుంచి మల్లారెడ్డి హెల్త్ సిటీ వరకు ఫుట్‌పాత్ లేకపోవడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. జిహెచ్ఎంసి అధికారులు మాత్రం ఈ సమస్యను చిన్న విషయంగా తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికే ఈ సమస్యపై వార్తలు ప్రచురించినప్పటికీ జిహెచ్ఎంసి అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఫుట్‌పాత్‌ను పూర్తిగా ఆక్రమించి వాహనాలను పార్క్ చేయడం, హాస్పిటల్‌కు వచ్చే అటెండర్లు అక్కడే నిలిపివేయడం వల్ల పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతం హాస్పిటల్ జోన్ కావడంతో రోజూ వందలాది మంది రాకపోకలు సాగిస్తారు. అలాంటి ప్రదేశంలో ఫుట్‌పాత్ లేకపోవడం ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నట్టే. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ప్రశ్న స్థానికులను కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా, గురువారం సాయంత్రం సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ సమీపంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా నిలిపిన ద్విచక్ర వాహనాలపై జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 41 సి.పీ యాక్ట్ కేసులు నమోదు చేసి, రికవరీ వాన్ ద్వారా 8 వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ నరసింహారావు పర్యవేక్షణలో చర్యలు తీసుకున్నారు. అయితే ఈ చర్యలు తాత్కాలికమేనని, సమస్యకు మూల కారణమైన ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించకపోతే పరిస్థితి మారదని స్థానికులు అంటున్నారు. ఉదయం, సాయంత్రం తరచూ తనిఖీలు నిర్వహిస్తే వాహనదారులు అక్రమ పార్కింగ్‌కు దూరంగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి ఫుట్‌పాత్‌ను పునరుద్ధరించడంతో పాటు ఆక్రమణలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చిన్న సమస్యగా భావించిన ఈ నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular