యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ సీఐటీయూ ఆరోపణ
- పెద్దేముల్ ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పెద్దేముల్, జూన్ 13 (ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాద ఘటనలో ఓ యువకుడిపై అన్యాయంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ ఆరోపించారు.ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పెద్దేముల్ పోలీసుల తీరును విమర్శించారు.ఈ నెల 2న మంబాపూర్ గ్రామంలో బుల్లెట్ మోటార్ సైకిల్, స్కూటీ ఢీకొన్న ఘటనలో అనిర్వేష్ అనే యువకుడిని కావాలనే కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.ప్రమాద ఘటనకు రాజకీయ రంగు పూసి, కొందరి ఒత్తిళ్లకు లోనై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.సమగ్ర విచారణ జరపకుండా యువకుడిని రిమాండ్కు పంపడం వల్ల అతని భవిష్యత్తు దెబ్బతిందని, ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించడం ఆందోళనకరమని అన్నారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అధికార దుర్వినియోగం జరిగి ఉంటే పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్పై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.వికారాబాద్ జిల్లా ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకుని బాధిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.ఈ అంశంపై ఉన్నతాధికారులు స్పందించి నిష్పాక్షిక విచారణ చేపట్టాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీఐటీయూ హెచ్చరించింది.

