చెంచు మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ..
- మార్కెట్ యార్డు అభివృద్ధిపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమీక్ష
- ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు..
- రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం
వనపర్తి, జూలై 01(ప్రజాక్షేత్రం):వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి బుధవారం పట్టణంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని 10వ వార్డులో చెంచు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరై అభివృద్ధి పనులు, రైతులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. చీరల పంపిణీ సందర్భంగా చెంచు మహిళలు తమ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, బోరు ఏర్పాటు చేయాలని, గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేఘారెడ్డి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక కౌన్సిలర్ మధుసూదన్ గౌడ్‌తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. అనంతరం వనపర్తి మార్కెట్ యార్డులో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, మార్కెట్ యార్డు అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలు, మార్కెట్‌లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, ఆదాయం–వ్యయాల వివరాలు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులతో కలిసి సమీక్షించారు. మార్కెట్ వ్యవస్థ పారదర్శకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా మార్కెట్ యార్డులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షుడు రామ కృష్ణారెడ్డి, డైరెక్టర్లను వారి పదవీకాలంలో అందించిన సేవలను గుర్తించి ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవి రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరే రాములు, మార్కెట్ యార్డు అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, డైరెక్టర్లు కృష్ణయ్య, గోపాల్ నాయక్, సురేష్, ఓమేష్, లతీఫ్, శారద, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బ్రహ్మచారి, బి. కృష్ణ, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

