📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణకూలీల కన్నీటి గాథ..ఉపాధి హామీ పనులకు కూడా లంచమేనా ?

కూలీల కన్నీటి గాథ..ఉపాధి హామీ పనులకు కూడా లంచమేనా ?

📰 Generate e-Paper Clip

కూలీల కన్నీటి గాథ..ఉపాధి హామీ పనులకు కూడా లంచమేనా ?

  • దుగ్గాపూర్‌లో ఉపాధి హామీ పథకంపై తీవ్ర ఆరోపణలు
  • ఉపాధి హామీ పనుల కేటాయింపుకు రూ.500 నుండి రూ.1000 వసూలు చేస్తున్నారని ఉపాధి హామీ కూలీల ఆరోపణ
  • జాబ్ కార్డులకు రూ.1,500–రూ.2,000 వరకు వసూళ్లు చేస్తున్నారని కూలీల ఆవేదన
  • గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కూలీల నిరసన
  • విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్

పెద్దేముల్, జులై 06(ప్రజాక్షేత్రం):
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని దుగ్గాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.ఉపాధి పనులు కావాలన్నా, జాబ్ కార్డు పొందాలన్నా డబ్బులు చెల్లించాల్సిందేనని గ్రామానికి చెందిన పలువురు కూలీలు ఆరోపించారు. దుగ్గాపూర్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య డబ్బులు తీసుకుంటేనే పనులు చూపిస్తున్నారని, డబ్బులు ఇవ్వని వారి పేర్లకు హాజరు నమోదు చేయడం లేదని వారు వాపోయారు. ఈ ఆరోపణలకు నిరసనగా శనివారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. గ్రామంలో సుమారు 200 మంది వరకు ఉపాధి కూలీలు ఉన్నారని,వారిలో చాలామంది ఉపాధి హామీ పనులపైనే జీవనోపాధి కొనసాగిస్తున్నారని తెలిపారు.కూలీల కథనం ప్రకారం…ఉపాధి హామీ పనులు పొందాలంటే రూ.500 నుంచి రూ.1,000 వరకు, కొత్త జాబ్ కార్డుల కోసం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు కేటాయించడం లేదని,హాజరు నమోదు చేయడం లేదని తెలిపారు. వసూలు చేసిన డబ్బులను పై అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని ఫీల్డ్ అసిస్టెంట్ చెబుతున్నారని ఆరోపించారు. గొట్లపల్లి రాములు,పసుల ఎల్లమ్మ, చుక్కమ్మ, కమలమ్మ, చంద్రమ్మ, వడ్డె ఎల్లప్ప, శంకరప్ప, బాయమ్మ, శ్రీను, బాలప్ప, రాజు తదితర కూలీలు తమ సమస్యలను వెల్లడించారు. గ్రామంలో వికలాంగులు, వితంతువులు, నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఉపాధి హామీ పనులు లేక కుటుంబాల పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దుగ్గాపూర్ గ్రామ సర్పంచ్ జాజికార్తి మంగమ్మతో పాటు గొట్లపల్లి రాములు, గొట్లపల్లి రవి, అశోక్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ…ఉపాధి హామీ పనులు సక్రమంగా అందకపోవడంతో ఇప్పటికే పలువురు కూలీలు వలస బాట పట్టారని చెప్పారు. ప్రభుత్వం వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడడం వల్ల పథకం లక్ష్యం దెబ్బతింటోందని విమర్శించారు. గతంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్‌పై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉపాధి హామీ కూలీలు హెచ్చరించారు.

పెద్దేముల్ మండల ఏపీఓ నర్సింహులు వివరణ

పెద్దేముల్ మండలంలో ఉపాధి హామీ పనుల కోసం కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ లకు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఏ గ్రామంలోనైనా ఫీల్డ్ అసిస్టెంట్ లు ఉపాధి హామీ కూలీలకు ఎవరికైనా డబ్బులు అడిగితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైనా ఉపాధి హామీ కూలీల వద్ద డబ్బులు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే వారి పైన శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఉన్నతాధికారులకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని పెద్దేముల్ మండల ఏపీఓ నర్సింహులు తన వివరణలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular