📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణభూముల సర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ చిత్రా మిశ్రా

భూముల సర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ చిత్రా మిశ్రా

📰 Generate e-Paper Clip

భూముల సర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, జూలై 10(ప్రజాక్షేత్రం):జిల్లాలో భూముల సర్వే, రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సాదా బైనామా–భూభారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి అంశంలో అధికారులు పక్కా ప్రణాళికతో పనిచేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూముల సర్వే, రీ-సర్వే, భూభారతి–సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పురోగతిపై సమీక్షించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన రీ-సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 70 గ్రామాల్లో భూముల సర్వే చేపట్టనున్నట్లు, ఇప్పటికే ఏడు గ్రామాల్లో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లోనూ ప్రత్యేక బృందాలతో యుద్ధ ప్రాతిపదికన సర్వే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో సుమారు 94,637 ఎకరాల్లో సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలని ఆదేశించారు. ప్రతి పది మంది బీఎల్‌వోలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి పకడ్బందీగా కార్యక్రమం అమలు చేయాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనంతరం గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశమై ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మోబిన్, కాలీచరణ్, మాధవి తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular