📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఏసీబీ వలలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి..

ఏసీబీ వలలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి..

📰 Generate e-Paper Clip

ఏసీబీ వలలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి..

  • బయటపడ్డ కోట్ల ఆస్తులు
  • హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్‌పై ఏసీబీ కేసు
  • అక్రమాస్తుల ఆరోపణలపై ఏకకాలంలో సోదాలు
  • రికార్డుల ప్రకారం రూ.9.24 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
  • నగదు, బంగారం, ఫ్లాట్లు, భవనాలు స్వాధీనం
  • అధికారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ

హైదరాబాద్ జులై 14(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చీఫ్ ఇంజనీర్ బి. రవీందర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఏకకాలంలో పలుచోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు, రికార్డుల ప్రకారం సుమారు రూ.9.24 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బీ), 13(2) కింద రవీందర్‌పై కేసు నమోదైంది. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీలకు సంబంధించిన మరో తొమ్మిది ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. వీటిలో కొండకల్, కిష్టాపూర్, పసమాముల గ్రామాల్లో రూ.38.89 లక్షల విలువైన ఐదు ఓపెన్ ప్లాట్లు, నార్సింగి, నానక్‌రాంగూడలో రూ.2.07 కోట్ల విలువైన నాలుగు ఫ్లాట్లు, కొండాపూర్ మసీద్ బండలో రూ.3 కోట్ల విలువైన జీ+4 భవనం, మోకిలలో రూ.1.33 కోట్ల విలువైన సెమీ-ఫినిష్డ్ విల్లా ఉన్నాయి. ఈ ఆస్తుల మార్కెట్ విలువ పత్రాల్లో చూపిన దానికంటే చాలా రెట్లు అధికంగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. వీటితో పాటు రూ.3.82 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.45.06 లక్షలు, రూ.36.7 లక్షల విలువైన 1.44 కిలోల బంగారు ఆభరణాలు, 12.5 కిలోల వెండి వస్తువులు, నాలుగు వాహనాలు, ఇతర గృహోపకరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రవీందర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, మరిన్ని ఆస్తుల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular