
పారిశుద్ధ్యం, పచ్చదనంపై ఎంఎంసీ ఫోకస్
★ నాగార్జున నగర్‌లో ఎంఎంసీ కమిషనర్ తనిఖీ
కాప్రా, జూలై 21(ప్రజా క్షేత్రం): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి నాగార్జున నగర్ కాలనీలో సోమవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, అర్బన్ బయోడైవర్సిటీ, శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి రహదారులు, పారిశుద్ధ్యం, పచ్చదనం, ఆక్రమణలు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు.రోడ్ల వెంట ఖాళీగా ఉన్న ప్లాంటర్ బాక్స్‌లలో వెంటనే మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అర్బన్ బయోడైవర్సిటీ అధికారులను ఆదేశించారు. నగరంలో పచ్చదనం పెంపునకు అందుబాటులో ఉన్న ప్రతి ప్లాంటర్ బాక్స్‌ను వినియోగించాలని సూచించారు.రహదారులపై అక్రమంగా నిర్మించిన ర్యాంపులు, ఇతర ఆక్రమణలను తక్షణమే తొలగించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను (సీ అండ్ డీ) రోడ్లపై వేయకుండా అధీకృత ప్రాసెసింగ్ ప్లాంట్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని, కొత్త భవన నిర్మాణాలు తప్పనిసరిగా ఆ ప్లాంట్‌తో అనుసంధానం కావాలని స్పష్టం చేశారు.వాణిజ్య సంస్థలు ట్రేడ్ లైసెన్సులను తప్పనిసరిగా ప్రదర్శించాలని, హాస్టళ్లు అన్ని చట్టబద్ధ అనుమతులు కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి చెత్త డంపింగ్‌ను అరికట్టే చర్యలు చేపట్టాలని, పరిశుభ్రత, పచ్చదనం, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.

