📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతప్రకృతి ఒడిలో కొలువైన పరమశివుడు..!

ప్రకృతి ఒడిలో కొలువైన పరమశివుడు..!

📰 Generate e-Paper Clip

ప్రకృతి ఒడిలో కొలువైన పరమశివుడు..!

  • కోరిన భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న లింగమయ్య పుణ్యక్షేత్రం.
  • చారిత్రక ఆలయం…! చరిత్ర తిరగరాసిన ముమ్మలనేని  రాజశేఖర్.
  • భక్తులను ఆకట్టుకుంటున్న 25 అడుగుల ఆది యోగి విగ్రహం.
  • అడికేశ్ లింగమయ్య ఆలయానికి విశేషంగా తరలివస్తున్న భక్తులు.
  • శ్రావణం, కార్తీక మాసాల్లో లింగమయ్యకు భక్తుల ప్రత్యేక పూజలు.  

కోటగిరి, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):చుట్టూ కొండలు దట్టమైన అడవులు పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణం లో సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి లింగమయ్య రూపంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం గా వెలసింది అడికేశ్ లింగమయ్య ఆలయం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులో వెలసిన అడికేశ్ లింగమయ్య ఆలయం మహా ఋషి ఆధ్యాత్మిక తపస్వి ముమ్మలనేని రాజశేఖర్ కృషితో పునర్నిర్మాణం గావించబడి లింగమయ్య రూపంలో ఆ పరమశివుడు కోరిన భక్తులకు కొంగు బంగారం గా నిలుస్తున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా అడికేశ్  లింగమయ్య ఆలయం ప్రసిద్ధి చెందుతుంది. సొంత ఊరి పై మమకారంతో పరమశివుడిపై భక్తితో కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచేలా ప్రకృతి ఒడిలో మహాద్భుతాన్ని ఆవిష్కరింపజేశారు ముమ్మలనేని రాజశేఖర్, ఋషులు, మునులు తపస్సులు చేసిన, నవ సిద్ధులు సంచరించిన పుణ్య క్షేత్రంగా భావించే చరిత్ర కలిగిన లింగమయ్య ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టి ఆలయ చరిత్రను తిరగరాసి ఈ ప్రాంతం గురించి భవిష్యత్తు తరాలు గొప్పగా చెప్పుకునేలా చేశారు ముమ్మలనేని రాజశేఖర్. ఈ ఆలయంలో పచ్చని ప్రకృతిలో కొలువైన పరమశివుడు నిత్యం పూజలందుకుంటూ కోరిన భక్తులకు కోరికలు తీరుస్తున్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు.

అడికేశ్ లింగమయ్య ఆలయ చరిత్ర

కొన్ని వందల సంవత్సరాల క్రితం కోటగిరి మండలం కల్లూరు గ్రామంలో ఉన్న బసవ రెడ్డి అనే వ్యక్తి 100 ఆవుల మందను పోషించేవారు. ఆ ఆవులను ప్రస్తుతం అడికేశ్ లింగమయ్య ఆలయం ఉన్న గుట్ట వైపుకు ప్రతిరోజు మేతకు తీసుకువచ్చేవారు. అందులో ఒక పిల్లలు లేని గొడ్డు ఆవు ప్రతిరోజు మంద నుండి వేరుగా వెళ్లి సాయంత్రం మళ్ళీ మందలో కలిసేది. ఆ ఆవు ప్రవర్తనను గమనించిన పశువుల కాపరి ఒకరోజు దాని వెంట వెళ్లి చూడగా దట్టమైన అడవుల్లో కొండపై ఉన్న రాతి లింగంపై ఆ ఆవు దానికదే పాలను వదలడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే గ్రామస్తులకు పశువుల కాపరి ఈ విషయం తెలుపగా ఆ రాతిని స్వయంభు శివలింగంగా భావించి అప్పటినుండి నిత్యం శివయ్య ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ చరిత్రకు మునుపే ఈ ప్రాంతంలో సాక్షాత్తు ధర్మరాజు పూజలు నిర్వహించినట్లు, ఋషులు మునులు తపస్సులు చేసినట్లు, నవనాద సిద్దులు సంచరించినట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి.

ఆలయ పునర్నిర్మాణం, విశిష్టత

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కాస్ పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పర్వత శిఖరం పై ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతున్న లింగమయ్య ఆలయం ప్రస్తుతం పునర్నిర్మానంతో మరింత వైభవాన్ని సంతరించుకుంది. ఆలయ పునర్నిర్మాణ దాత, ముమ్మలనేని రాజశేఖర్ శివుడి పై భక్తితో, ఆధ్యాత్మిక భావనతో కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయ పునర్నిర్మాణాన్ని ఏకశిలతో నిర్మించడం విశేషం. సాధారణంగా ఆలయాల నిర్మాణం అనేక రాళ్లను కలిపి చేస్తారు. కానీ ఈ లింగమయ్య ఆలయ పునర్నిర్మాణంలో ఏకశిల(ఒకే రాయి) కృష్ణ రాయితో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఏకశిలతో శివలింగం, నంది, ఆలయ నిర్మాణం జరగటంతో భూదేవి గర్భం నుండి పరమశివుడు ప్రత్యక్షంగా వెలసినట్లు భక్తుల హృదయాల్లో దివ్యానుభూతిని కలిగిస్తోంది. దాదాపు పదేళ్లకు పైగా ప్రణాళికతో, భక్తుల సహకారంతో, శిల్పుల అంకిత భావంతో ఈ కృష్ణరాయి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆలయంలోని పురాతన రాతి నందిలో ప్రాణం ఉందని భక్తులు భావిస్తారు ఈ నంది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడం దేవుడి లీలకు ప్రతిరూపంగా భావిస్తారు భక్తులు. పంచభూతాల తత్వానికి ప్రత్యేకమైన పంచలింగాల్లో ఒకటిగా పేరుగాంచిన అడిగేష్ లింగమయ్య ఆలయం ప్రాచీనత, పవిత్రత, విశ్వాసం కలగలిపిన దేవస్థానం గా భక్తుల్లో అపారమైన విశ్వాసం నెలకొంది. ప్రతి ఏటా శివరాత్రి రోజు రాత్రి ఆలయంలో ఏర్పాటు చేసే అగ్నిగుండం ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ అగ్ని గుండాన్ని దాటిన వారికి ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయని అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం భక్తి విశ్వాసం,శ్రద్ధ, శివానుభూతి కలగలిసిన పవిత్ర క్షేత్రంగా, ఇక్కడి ప్రతి శిలలో, ప్రతి గాలిలో, ప్రతి నాదంలో ఆ పరమశివుడు సాక్షాత్కరిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు.

విశేషంగా ఆకట్టుకుంటున్న 25 అడుగుల ఆది యోగి విగ్రహం

అడికేశ్ లింగమయ్య ఆలయ ప్రాంగణంలో ఉన్న అతిపెద్ద రాయిపై 25 అడుగుల ఆది యోగి విగ్రహం ఏర్పాటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముందుగా ఇక్కడ ఆలయ నిర్మాణం మాత్రమే చర్చలో ఉన్నప్పటికీ ఆలయ పునర్నిర్మాణం అనంతరం అక్కడ ఉన్న రాయిపై ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించిన ఆలయ పునర్నిర్మాణ కర్త ముమ్మలనేని రాజశేఖర్ ఎంత ఖర్చైనా పర్వాలేదని ముందుకొచ్చి 25 అడుగుల ఆది యోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. పచ్చటి ప్రకృతిలో కొండ శిఖరంపై ఉన్న ఎత్తైన రాయిపై వెలసిన ఆదియోగి విగ్రహం ఆలయానికి వచ్చే భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయంలో వెలసిన ఆదియోగి విగ్రహం ఆలయ సౌందర్యాన్ని అమాంతం పెంచేసింది. తెలంగాణలో ఉన్న ఏకైక ఆదియోగి విగ్రహంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అడిగేశ్ లింగమయ్య ఆలయంలోని ఆదియోగి విగ్రహం ట్రెండింగ్ లో ఉందటంలో సందేహం లేదు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి నిత్యం భక్తులు విశేషంగా తరలివచ్చి అలికేశ్ లింగమయ్య తో పాటు ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు.

శ్రావణం, కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజలు

పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలసిన లింగమయ్య ఆలయంలో ఆలయ పూజారి బస్వరాజ్ మహారాజ్ ఆధ్వర్యంలో శివుడు నిత్యం ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. దీంతోపాటు ఆలయంలో శ్రావణం, కార్తీకమాసంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసం శని,సోమవారాల్లో భక్తుల తాకిడి విశేషంగా ఉంటుంది. భక్తుల కోసం ప్రతి సోమవారం, శ్రావణమాసంలోని శని సోమవారాల్లో అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. నేడు శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు లింగమయ్యను దర్శించుకునే అవకాశం ఉంది. ఇందుకుగాను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ సమీపంలో ఉన్న బస్వాపూర్, అడ్కాస్ పల్లి గ్రామస్తులంతా కలిసి శ్రావణమాసం చివరి సోమవారం రోజు భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వినాయక చవితి రోజున ప్రత్యేక పూజల అనంతరం తర్వాతి రోజైన భాద్రపద శుద్ధ పంచమి రోజున ప్రతియేటా లింగమయ్య ఆలయంలో లింగమయ్య జాతర పేరుతో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం పూర్తవడంతో ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఆలయ కమిటీ వారు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular