📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణరైతుల ఐక్యతనా..?..రాజకీయ చతురతనా..?

రైతుల ఐక్యతనా..?..రాజకీయ చతురతనా..?

📰 Generate e-Paper Clip

  • సోమశేఖర రావు కు చైర్మన్ పదవి ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మాణం చేసిన రైతులు
  • ఎమ్మెల్యే పోచారంను కలిసిన ఐదు గ్రామాల రైతులు..?
  • ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన మరికొందరు ఆశావహులు..?
  • ఎత్తొండ సొసైటీ చైర్మన్ ఎన్నిక పై నెలకొన్న ఉత్కంఠ..!

కోటగిరి,సెప్టెంబర్ 09(ప్రజాక్షేత్రం):రైతులు సభ్యులుగా ఉండే సహకార సంఘాల చైర్మన్ ల ఎన్నిక ఈసారి నామినేటెడ్ విధానంలో నిర్వహిస్తారన్న వార్తల మేరకు సహకార సంఘాల చైర్మన్ ల ఎన్నిక పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎన్నికలకు వెళ్లకుండా నేరుగా నామినేటెడ్ విధానంలో సొసైటీ డైరెక్టర్లు, అధ్యక్షులను ఎన్నుకునే ప్రపోజల్ ను ప్రభుత్వం పరిశీలిస్తున్న తరుణంలో ఆశావహుల నుండి తీవ్ర పోటీ ఎదురవుతుంది. కోటగిరి పోతంగల్ మండలాల్లో నాలుగు సొసైటీలు ఉండగా సొసైటీ ఎన్నికల్లో రాజకీయ ప్రమేయం జరగడంతో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా రెండు సొసైటీలలో భారీ అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. సహకార చట్టాల ప్రకారం ఆయా సొసైటీల్లో సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఎంక్వయిరీలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎత్తొండ సొసైటీలో భారీ అవకతవకలు జరిగాయని రైతులు ఆరోపిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టడంతో అధికారులు పూర్తి ఎంక్వయిరీ చేసి సొసైటీ చైర్మన్, సెక్రెటరీ సహా డైరెక్టర్లందరికీ ఒక్కొక్కరికి దాదాపు 90 లక్షల పైచిలుకు రికవరీ వేసినట్లు గతంలో వార్తలు షికార్లు కొట్టాయి . అంతేకాకుండా పాలకవర్గంలోని సభ్యులందరి స్థిరాస్తులు బ్యాంకు ఖాతాలను సైతం అధికారులు సీజ్ చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో సొసైటీ చైర్మన్ పదవులను నామినేటెడ్ కోటాలో నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్నందున ఎత్తోండ సొసైటీ పరిధిలోని ఐదు గ్రామాల రైతులు సొసైటీ ఆవరణలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని గతంలో సొసైటీ చైర్మన్ గా పనిచేసిన సోమశేఖర రావును తమ సొసైటీ చైర్మన్ గా నియమించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇంతటితో ఆగకుండా రైతులందరూ భారీ సంఖ్యలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని సైతం కలిసి తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. గతంలో చిన్న సొసైటీగా ఉన్న ఎత్తోండ సహకార సంఘం దాదాపు వంద కోట్ల టర్నోవర్ కు తీసుకువచ్చిన, సొసైటీని దినదిన అభివృద్ధి చేసి సొసైటీకి రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకువచ్చిన సోమశేఖర రావును తమ సొసైటీ చైర్మన్ గా నియమించాలని ముక్తకంఠంతో రైతులు ఎమ్మెల్యే పోచారం కు వార్తలు వినిపిస్తున్నాయి. గతసారి సొసైటీ చైర్మన్ కు జరిగిన ఎన్నికల్లో సోమశేఖర రావును కాదని వేరే వారిని సొసైటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులుగా నియమిస్తే పాలకవర్గం అసమర్థతతో సొసైటీని పూర్తిగా దివాలా తీసేలా చేశారని రైతులు మండిపడ్డట్లు తెలుస్తుంది. సోమశేఖర రావు పీరియడ్లో సొసైటీ దినదినాభివృద్ధి చెందిందని ఆ తర్వాత ఏర్పడ్డ పాలకవర్గం సొసైటీని అస్తవ్యస్తం చేసిందని రైతులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నట్లు విశ్వసినీయ సమాచారం. చివరికి రైతుల వద్ద కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించలేని స్థితిలోకి సొసైటీ రావడం తో రైతులకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని , గతంలో 38 మంది సిబ్బంది పని చేసే సొసైటీలో ప్రస్తుతం కేవలం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారని మిగతా సిబ్బంది అంతా రోడ్డున పడ్డారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఎత్తొండా సొసైటీ చైర్మన్ గా కొత్త సోమశేఖర రావును నియమించాలని రైతులు తమ అభిప్రాయాలను ఎమ్మెల్యేకు తెలుపటమే కాకుండా తమ సొసైటీ భవిష్యత్తును కాపాడాలని కోరినట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా రైతులు కోరిన కొత్త సోమశేఖర రావు కు ఎమ్మెల్యే పోచారం కు సఖ్యత లేకపోవడం వారిద్దరి మధ్య గతంలో పలు అంతర్గత విభేదాలు ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో ఎత్తొండా సొసైటీ చైర్మన్ గా రైతులు సిఫారసు చేసిన కొత్త సోమశేఖర రావు ఎన్నిక పై సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో సొసైటీ చైర్మన్ గా పనిచేసిన కొత్త సోమశేఖర రావు పై సైతం అధికారులు సహకార చట్టం ప్రకారం ఎంక్వయిరీ నిర్వహించగా ఆయన ఆ ఎంక్వయిరీపై స్టే తెచ్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం సోమశేఖర రావు ఎన్నికపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

ఎమ్మెల్యే ను కలిసిన మరికొందరు ఆశావాహులు..?

సొసైటీ పరిధిలోని ఐదు గ్రామాల రైతులు జరిపిన సమావేశం వివరాలు బహిర్గతం అవడంతో మరికొందరు ఆశావాహులు ఎమ్మెల్యే పోచారం వద్దకు పరుగులు పెట్టినట్లు తెలుస్తుంది. అందులో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఓ పార్టీ నేత తండ్రి సైతం ఉన్నట్లు సమాచారం. ఓ పార్టీ నేత తండ్రి తో పాటు మరో వ్యక్తి సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికంగా చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే పోచారంకు గత 30 ఏళ్లుగా అత్యంత సన్నితంగా ఉన్న ఓ పార్టీ నేత తండ్రికి సొసైటీ చైర్మన్ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నట్లు స్థానికంగా వార్తలు షికార్లు కొడుతున్నాయి.ఓ నియోజకవర్గ స్థాయి నాయకుడి తండ్రిని ఎత్తొండ సొసైటీ చైర్మన్ గా నియమించడం వెనుక రాజకీయ చతురతుతో కూడిన వ్యూహం ఉందని స్థానికంగా చర్చలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారం పై పోచారం వర్గంలోని కొందరు నాయకులు పెదవి విరిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయనకు చైర్మన్ పదవి ఇస్తే స్థానికంగా ఉన్న ఓ వర్గం నాయకులు ఎమ్మెల్యే పోచారం కు దూరం అవుతారనే ఊహాగానాలు సైతం మొదలయ్యాయి. పోచారం వర్గంలోని కొందరు నాయకులు రైతులు సైతం సొసైటీ అభివృద్ధి చేసే వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సొసైటీ పూర్తిగా దివాలా తీసిందని గతంలో సొసైటీలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులకు చైర్మన్ పదవి ఇస్తే సొసైటీని మళ్లీ దాడిలో పెడతారని పోచారం వర్గం నాయకులు కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎత్తొండ సొసైటీ చైర్మన్ ఎన్నికలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ నామినేటెడ్ పద్ధతిలో సొసైటీ పాలకవర్గాలను నియమిస్తే ఎత్తొండ సొసైటీ చైర్మన్ ఎన్నిక నియోజకవర్గ నాయకులకు తలనొప్పిగా మారనుంది. మరి కొద్ది రోజుల్లో చైర్మన్ ఎన్నిక పై క్లారిటీ రానున్న నేపథ్యంలో రైతులంతా ఏకమై ముక్తకంఠంతో ప్రస్తావించిన సోమశేఖర రావుకు చైర్మన్ పదవి దక్కుతుందా…? లేదా ఎలాగైనా పదవి దక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయంగా పావులు కదుపుతున్న వేరే వ్యక్తులకు సొసైటీ చైర్మన్ పదవి దక్కుతుందా అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. రైతుల ఐక్యతనా…? లేక రాజకీయ చతురతనా…? ఏది నెగ్గుతుంది గతంలో జరిగినవన్నీ పోచారం దృష్టిలో పెట్టుకోకుండా రైతులు సూచించిన సోమశేఖర రావు చైర్మన్ అవుతారా లేదా రాజకీయ చతురతతో మరెవరైనా ఎన్నికవుతారో తెలియాలంటే సొసైటీ చైర్మన్ ఎన్నిక అధికారికంగా జరిగేంతవరకు ఆగాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular