అధికారులు రాకపోతే.. సర్వసభ్య సమావేశం ఎందుకు?
- మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా ..!
- అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచులు
- మహిళా సర్పంచులను అధికారులు లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచులు
- రసాభాసగా పోతంగల్ మండల సర్వసభ్య సమావేశం.
పోతంగల్, సెప్టెంబరు 11(ప్రజాక్షేత్రం):మండల సర్వసభ్య సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై పోతంగల్ మండల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం గురించి వారం రోజుల ముందే సమాచారం ఇచ్చినా అధికారులు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరేందుకు సమావేశానికి వస్తే… అధికారులు లేకపోతే తమ సమస్యలను ఎవరికి చెప్పాలని మండల ప్రత్యేక అధికారిని ప్రశ్నించారు. సర్పంచుల ఆగ్రహంతో మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మండలకేంద్రంలో శుక్రవారం మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి బాలు హాజరయ్యారు. సమావేశంలో పలువురు సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యలను ప్రస్తావించారు. పోతంగల్ సర్పంచ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో మహిళా సర్పంచులను అధికారులు లెక్కచేయడం లేదని మహిళా సర్పంచులు సూచించిన వారిలో ఏ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన లిస్టులో లబ్ధిదారులు లేరా అని ఎంపిడిఓను ప్రశ్నించారు. దీంతో ఇతర గ్రామాల సర్పంచులు కల్పించుకుని సర్పంచులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే సూచించిన లిస్టులో నిజమైన లబ్ధిదారులు ఉంటే వారికి ఇండ్లు కేటాయించాలని వారిపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదని ఎంపీడీవోకు తెలిపారు. కల్లూరు సర్పంచ్ రామిరెడ్డి మాట్లాడుతూ… అక్రమ ఇసుక రవాణాతో రోడ్ల ధ్వంసం అవుతున్నాయని రవాణాపై పోలీసు అధికారులకు సమాచారం ఇస్తే.. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారికి సమాచారం చేరవేస్తున్నారంటూ ఆరోపించారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులే వారికి సమాచారం లీక్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణా ను అడ్డుకోవాలని అధికారులను కోరారు. అంగన్వాడి కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చేతన్ నగర్ సర్పంచ్ కోరారు. తమ గ్రామంలో అంగన్వాడీ టీచర్, ఆయా సరిగ్గా పనిచేయడం లేదని ఆమె అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని హంగర్గా సర్పంచ్ ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఓకే లైసెన్స్ తో గ్రామాల్లో నాలుగు ఐదు కల్లుబట్టీలు నడుపుతున్నారని సుంకిని సర్పంచ్ అధికారులకు తెలిపారు. ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండే రెవిన్యూ, పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశానికి రాకపోతే ఎలా అని షాజీ పటేల్ ప్రశ్నించారు. అధికారులు లేకపోతే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు లేకపోతే సర్వసభ్య సమావేశం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సర్వసభ్య సమావేశంలో అన్ని శాఖల అధికారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరారు.గ్రామాల్లో కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని రాత్రి వేళ కరెంటు పోకుండా చూడాలని కల్లూరు సర్పంచ్ రామిరెడ్డి అధికారులను కోరారు. సర్పంచులకు సెక్రటరీలు సహకరించడం లేదని బిల్లుల విషయంలో సతాయిస్తున్నారని అధికారులకు సర్పంచులు విన్నవించారు. రైతు వేదికలో సమావేశం నిర్వహించినప్పుడు వ్యవసాయ శాఖ అధికారి సమావేశంలో లేకపోవడం ఏంటని సర్పంచులు ప్రశ్నించారు. ఇతర ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వచ్చేసారి నిర్వహించే సమావేశాలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి బాలు మాట్లాడుతూ… అధికారులు సర్పంచులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గ్రామాలు అభివృద్ధి చెందితేనే మండలం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసి మాట్లాడుకుని పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఒకవేళ గ్రామంలోని అంగన్వాడి టీచర్లు, హెల్త్ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు సరిగ్గా పనిచేయకపోతే ఆయా శాఖల ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చందర్, మండల సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

