📄 ePaper
Sunday, September 20, 2026
📄 ePaper
Homeతెలంగాణఘనంగా ఖైరతాబాద్ గణనాథుడి ఆవిష్కరణ.. నేడే తొలి పూజ

ఘనంగా ఖైరతాబాద్ గణనాథుడి ఆవిష్కరణ.. నేడే తొలి పూజ

📰 Generate e-Paper Clip

ఘనంగా ఖైరతాబాద్ గణనాథుడి ఆవిష్కరణ.. నేడే తొలి పూజ

  • ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల మహాగణపతి
  • పంచముఖ సంకటహర రూపంలో దర్శనమిస్తున్న గణనాథుడు
  • మట్టితో పర్యావరణ హితంగా విగ్రహం నిర్మాణం
  • సోమవారం గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ
  • ఆదివారం నుంచే దర్శనానికి పోటెత్తిన భక్తజనం

హైదరాబాద్ సెప్టెంబర్ 13(ప్రజాక్షేత్రం):భాగ్యనగరంలో వినాయక చవితి ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఏడాది 72వ ఉత్సవాల్లో భాగంగా 69 అడుగుల ఎత్తుతో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో గణనాథుడు కొలువుదీరాడు. విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకోవడం ప్రారంభించారు. ఈసారి స్వామివారు ఐదు ముఖాలు, ఐదు పడగల సర్పం, బహుళ హస్తాలతో సంకటాలను హరించే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గణపతికి ఒకవైపు 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం, మరోవైపు కాళికామాత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యావరణ హితంగా రూపుదిద్దుకున్న ఈ విగ్రహ నిర్మాణంలో సుమారు 30 టన్నుల నదీ మట్టి (రాజస్థాన్ బనాస్ నది నుంచి), 20 టన్నుల ఇసుక, 25 టన్నులకు పైగా స్టీల్‌తో పాటు గడ్డి, సేంద్రియ రంగులను ఉపయోగించారు. ప్రఖ్యాత శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ పర్యవేక్షణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా కళాకారులు మూడు నెలల పాటు శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని రూపొందించారు. గత జూన్‌లో కర్రపూజతో పనులు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పర్వదినమైన సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా మహాగణపతికి తొలి పూజ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అధికారికంగా భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా త్వరలో స్వామివారిని దర్శించుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 25 వరకు పూజలు కొనసాగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, హైదరాబాద్‌లోని మరో ప్రసిద్ధ గణపతి మండపమైన బాలాపూర్‌లో ఈ ఏడాది పూరీ జగన్నాథ్ ఆలయ థీమ్‌తో మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular