Homeతెలంగాణభూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం

భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం

📰 Generate e-Paper Clip

భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం

  • 120 ఏళ్ల తర్వాత మళ్లీ సమగ్ర భూ సర్వే
  • తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలు..
  • నక్షాలు లేని 413 గ్రామాల్లోనూ సర్వే
  • నవంబర్‌ 15లోగా పూర్తి చేయాలి..నిర్లక్ష్యం చేస్తే చర్యలు
  • రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

వనపర్తి, సెప్టెంబరు 28(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూ రీసర్వే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సుమారు 120 ఏళ్ల క్రితం భూ సర్వే జరిగిందని, ఇంతకాలం తర్వాత మళ్లీ సమగ్ర రీసర్వే చేపడుతున్నామని తెలిపారు. సర్వే ప్రక్రియలో అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, భూ సర్వే, గృహ నిర్మాణ తదితర అంశాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూ రీసర్వే పురోగతిని తహసీల్దార్లు, సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి వస్తున్న అభిప్రాయాలపైనా ఆరా తీశారు.

ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు

భూ భారతి చట్టం ద్వారా ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు, జియో కోఆర్డినేట్లతో కూడిన మ్యాప్‌, ఎల్‌పీఎం నంబర్‌ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ధరణి కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించి, భూ భారతి ద్వారా భూధార్‌ కార్డులు అందించడమే లక్ష్యమన్నారు.
సాదాబైనామాలు, భూ హద్దుల వివాదాలు, పాత రికార్డుల్లో లోపాలు, యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలకు సమగ్ర రీసర్వే ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. దశాబ్దాలుగా భూములను సాగు చేస్తున్నప్పటికీ సరైన టైటిల్‌ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల సమస్యలను గుర్తించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

70 గ్రామాల్లో తొలి దశ సర్వే

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తొలి దశలో 70 రెవెన్యూ గ్రామాలను రీసర్వేకు ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. నక్షాలు అందుబాటులో లేని మరో 413 రెవెన్యూ గ్రామాల్లోనూ దశలవారీగా సమగ్ర సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. ముందుగా గ్రామాల సరిహద్దులను పక్కాగా నిర్ధారించిన తర్వాత భూముల సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రీసర్వే కోసం ఆధునిక రోవర్లను అన్ని జిల్లాలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తొలి దశలో కొనుగోలు చేసిన రోవర్లతో పాటు అదనపు పరికరాలను కూడా సమకూర్చి అవసరానికి అనుగుణంగా జిల్లాలకు పంపుతున్నామన్నారు. వేలాది మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను అందుబాటులోకి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో సర్వేను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

నవంబర్‌ 15లోగా పూర్తి చేయాలి

నిర్దేశిత ప్రణాళిక ప్రకారం రీసర్వే ప్రక్రియను నాణ్యతతో పూర్తి చేయాలని, నవంబర్‌ 15లోగా ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వేను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. రైతులకు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని, వారి సందేహాలను క్షేత్రస్థాయిలోనే నివృత్తి చేయాలని ఆదేశించారు. అనవసర కారణాలతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయమైన సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు.

అబాది ఆస్తులకూ పక్కా మ్యాపింగ్‌

గ్రామాల్లో ఇళ్ల స్థలాలు, నివాస ప్రాంతాలు, అబాది ఆస్తులకు సంబంధించి గతంలో స్పష్టమైన మ్యాపింగ్‌ లేని సందర్భాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇకపై సర్వే ద్వారా ఆస్తి విస్తీర్ణం, హద్దులను నిర్ధారించి మ్యాప్‌తో సహా రికార్డుల్లో నమోదు చేస్తామన్నారు. వ్యవసాయేతర భూములు, అబాది ఆస్తులకు ప్రత్యేక రికార్డులు నిర్వహించి వాటి మూలలను జియో కోఆర్డినేట్లతో మ్యాప్‌ చేసేలా భూ భారతి చట్టంలో నిబంధనలు ఉన్నాయని వివరించారు.

వనపర్తి భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమావేశంలో ప్రస్తావించిన పలు భూ సమస్యలపై మంత్రి స్పందించారు. వనపర్తి పట్టణ శివారులోని సర్వే నంబర్‌ 9లో రెవెన్యూ, దేవాదాయ శాఖల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వనపర్తి బైపాస్‌ రహదారికి సంబంధించి అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించినందున మిగిలిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
ఈ రెండు అంశాలపై రెండు వారాల్లోగా పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.

వారం రోజుల్లో అర్జీల పరిష్కారం

ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్రమబద్ధంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రతి నెల ఒక్కో మండలానికి ఒక రోజు కేటాయించి ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించాలని అన్నారు. సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని, ప్రజల అర్జీల కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు వారం రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు.

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి

మక్తల్‌, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. తన నియోజకవర్గంలో గతంలో ప్రతిపాదించిన పవర్‌ప్లాంట్‌కు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజల భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, గృహ నిర్మాణ పథకాలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులకే ప్రాధాన్యం

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన ఇళ్లను లక్ష్యబద్ధంగా పూర్తి చేస్తామన్నారు. రెండో విడతలో గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పేదల ఇళ్లకు కూడా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రెండో విడతలో అవకాశం రాని అర్హులైన పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడో, నాలుగో విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, రెండో విడతలో 2,000 ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో జరిగిన తప్పులు రెండో విడతలో పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఐదు ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన

సమీక్షకు ముందు వనపర్తి ఐడీఓసీ నుంచి జిల్లాలో నిర్మించనున్న ఐదు ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. శ్రీరంగాపురం, ఆత్మకూరు, వీపనగండ్ల, చిన్నంబావి తహసీల్దార్‌ కార్యాలయాలకు రూ.2.25 కోట్ల చొప్పున, వనపర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రూ.2.10 కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సమావేశంలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్‌, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్‌ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌, కలెక్టర్లు ఆదర్శ్‌ సురభి, రిజ్వాన్‌ భాషా షేక్‌, హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, సిహెచ్‌.ప్రియాంక, కుష్బూ గుప్తా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular