గాంధీజీ ఆశయాలే అభివృద్ధికి బాటలు
- రాజనగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
- గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడి
వనపర్తి, అక్టోబరు 02(ప్రజాక్షేత్రం):మహాత్మా గాంధీ కలలుగన్న సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. సత్యం, అహింస, సేవా మార్గాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. మహాత్మా గాంధీ
జయంతి సందర్భంగా శుక్రవారం వనపర్తి పట్టణంతోపాటు రాజనగరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
గాంధీజీకి ఘన నివాళి
వనపర్తి పట్టణంలోని గాంధీ చౌక్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న భారతదేశం అంటే కేవలం స్వాతంత్ర్యం సాధించిన దేశం మాత్రమే కాదన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, స్వచ్ఛత, గ్రామీణాభివృద్ధి, శాంతి, సౌభ్రాతృత్వం పరిఢవిల్లే దేశమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్ముడు చేసిన త్యాగాలను స్మరించుకోవడంతోపాటు ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని అన్నారు.
రాజనగరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
గాంధీ జయంతి సందర్భంగా రాజనగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై
ఆర్చి నిర్మాణానికి భూమిపూజ చేశారు. నిర్మాణం పూర్తయిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుని గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి నూతన వస్త్రాలను అందజేశారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వసతులు
రాజనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో సీసీ రహదారులు, మురుగునీటి కాలువలు, వంతెన నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రానున్న రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని పనులు చేపడతామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, రాజనగర అభివృద్ధికి ప్రభుత్వం, తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. వనపర్తి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, మున్సిపల్ చైర్మన్ మాధవి, ఎస్ఎల్ఎన్ రమేష్, వైస్‌చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరె రాములు, మైనార్టీ విభాగం అధ్యక్షుడు అయూబ్ ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజనగరంలో జరిగిన కార్యక్రమాల్లో స్థానిక కౌన్సిలర్ నక్క రాణి రాజు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు శ్రీకాంత్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బ్రహ్మంచారి, మాజీ జడ్పీటీసీ గొల్ల వెంకటయ్య, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, నరేందర్ రెడ్డి, గొడుగు రామకృష్ణ, సంజీవ్ సాగర్, నారాయణ, కందూర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

