బహుజన రాజ్య పోరాటయోధుడు కాన్షీరామ్
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అడుగుజాడల్లో బహుజన రాజ్యాధికార సాధన ధ్యేయంగా ఉద్యమించి భారత రాజకీయాలలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టిన ధీరుడు, వీరుడు, బహుజన రాజ్య పోరాటయోధుడు కాన్షీరామ్. ‘ఓట్లు మావి – సీట్లు మీవా ? ఇకపై చెల్లదు ! ఇకపై చెల్లదు !’ అనే నినాదంతో ఆయన ప్రజానీకాన్ని ఎంతగానో ఆకట్టుకుని దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికారు. ‘ఒక ఓటు – ఒక నోటు’ అనే సరికొత్త నినాదంతో ఆయన ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేశారు.
పంజాబ్ రాష్ట్రం లోని రోపార్ జిల్లా ఖావాస్పూర్ గ్రామంలో సిక్కు కుటుంబంలో హరి సింగ్, బిషన్ కౌర్ అను దంపతులకు కాన్షీరామ్ 1934 మార్చి 15 నాడు జన్మించారు. ఆయన 1956 లో బి.ఎస్.సి డిగ్రీని అభ్యసించారు. కాన్షీరామ్ 1958 లో పూణె లోని రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థలో పరిశోధన అధికారిగా నియమితులయ్యారు. బుద్ధ మరియు అంబేద్కర్ జయంతులకు ప్రభుత్వం సెలవులను రద్దు చేయడాన్ని అదే సంస్థలో నాల్గవ తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దీనాబానా అనే ఉద్యోగి నిరసించారు. తత్ఫలితంగా ఆ ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించడాన్ని కాన్షీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతిమంగా ఆయన చేసిన చట్టబద్ధ పోరాటం వల్ల తిరిగి ఉద్యోగంలోకి తీసుకోబడ్డారు. అలాగే బుద్ధ మరియు అంబేద్కర్ జయంతులను సెలవులుగా రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు.
ఆ ఘటనలు కాన్షీరామ్ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. క్రమంగా ఆయన తమ జాతి అభివృద్ధి కోసం పని చేయాలి అని బలంగా నిర్ణయించుకున్నారు. తన జాతి అభివృద్ధి కోసం పాటుపడ్డ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాల్ని సాధించేందుకు కాన్షీరామ్ కంకణబద్దులై ఆ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ క్రమంలోనే కాన్షీరామ్ 1964 లో తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ‘బహుజన రాజ్య స్థాపన’ లక్ష్యంగా నిర్దేశించుకుని ‘బహుజన సమాజమే తన కుటుంబం’ అని భావించుకొని ఆయన అవివాహితుడుగానే ఉండిపోయారు.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన పుస్తకాలను కాన్షీరామ్ అధ్యయనం చేయడమే కాకుండా ఆయన ఆధ్వర్యంలో కొనసాగిన పోరాటాలను సునిశితంగా పరిశీలించారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి వంటి నాయకుల జీవితాలను మరియు వారు నిర్వహించిన పోరాటాలను ఆయన అధ్యయనం చేశారు. ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకం ఆయనను ఎంతగానో ప్రభావితం చేసింది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలను బహుజన సమూహంగా మారిస్తే అధికారం చేజిక్కించుకోడం సాధ్యమవుతుంది అని అవగతం చేసుకున్న కాన్షీరామ్ ఆ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. క్రమంగా ఆయన అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని బహుజన ప్రజానీకంలోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. ఎస్సి, ఎస్టి, ఒబిసి, మైనారిటీ ఉద్యోగులను ఏకం చేశారు. బోధించు, పోరాడు, సమీకరించు అనే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘాన్ని కాన్షీరామ్ 1971 లో స్థాపించి యువతను, ఉద్యోగులను చైతన్యపరిచి దోపిడి నుండి, వేధింపుల నుండి మరియు కుల వివక్షత నుండి విముక్తి గావించే దిశగా ఉద్యమించారు. అదేవిధంగా బహుజన కులాల ఐక్యతకు పెద్దపీట వేస్తూనే ‘విద్యావంతులై లబ్ధి పొందిన ఉద్యోగులు సమయం, సంపాదన మరియు ప్రతిభలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి అందివ్వడం మూలంగా వ్యవస్థను మార్చవచ్చు అనే ఉద్దేశ్యంతో కాన్షీరామ్ 1978 డిసెంబర్ 6 నాడు ‘బామ్ సెఫ్’ (వెనుకబడిన కులాల, మైనారిటీ ఉద్యోగుల సమాఖ్య) ను స్థాపించారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) లో కాన్షీరామ్ పనిచేసిననూ ఆ పార్టీలో పొడచూపిన విబేధాల కారణంగా ఆయన ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. బహుజనులను రాజకీయ పోరాటాలలో భాగం చేసేందుకు గాను కాన్షీరామ్ 1981 డిసెంబర్ 6 నాడు దళితా సోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి (డి.ఎస్.ఎస్.ఎస్) ను స్థాపించారు. ఆయన కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ‘సైకిల్ ర్యాలీ’ నిర్వహించి ప్రజలలోకి ‘సామాజిక పరివర్తన’ దిశగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను తీసుకెళ్లారు. 1982 లో జరిగిన హర్యానా, ఢిల్లీ, పంజాబ్ మరియు జమ్మూకశ్మీర్ ఎన్నికలలో దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి పాల్గొని నాలుగవ స్థానాన్ని సాధించింది.
ఆ క్రమంలోనే కాన్షీరామ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా 1984 ఏప్రిల్ 14 నాడు బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) ని స్థాపించారు. ‘తరచూ ఎన్నికలు రావాలి అని, తద్వారా ఆయా ఎన్నికల్లో తమ ఓట్ల శాతం, సీట్ల శాతం లను మెరుగుపరచుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని బి.ఎస్.పి ఒక విధానంగా రూపొందించుకుంది. క్రమంగా భారతీయ జనతా పార్టీ మద్దతుతో కుమారి మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి దేశంలో ‘తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి’ పీఠాన్ని అధిష్టించి నవచరిత్రని సృష్టించారు. ఆ రకంగా దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కుమారి మాయావతిని ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దిన ఘనత కాన్షీరామ్‌కి దక్కింది.
బహుజన సమాజ్ పార్టీ 1996 నాటికి ‘జాతీయ పార్టీ’గా గుర్తింపు పొందడం వెనకాల కాన్షీరామ్ నిర్విరామ కృషి ఉంది. 2003 లో పక్షవాతానికి గురైన కాన్షీరామ్ క్రమంగా ప్రజా జీవితం నుండి తప్పుకుని బి.ఎస్.పి బాధ్యతలను కుమారి మాయావతికి అప్పగించారు. ఒకే ఒకసారి 2007 నాటి అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే పూర్తిస్థాయి మెజారిటీని సాధించిన బి.ఎస్.పి ఆ తర్వాతి కాలంలో వెనకబడిపోయింది.
నేడు కాన్షీరామ్ కృషి వలన కులగణన, రిజర్వేషన్ల పెంపు తదితర సామాజిక న్యాయం వంటి డిమాండ్స్ ప్రబలంగా ముందుకు వస్తున్నాయి. ‘విప్లవం అంటే కేవలం సంక్షేమ పథకాల కోసం ఉద్యమాలు చేయడం కాదు. బహుజనుల రాజ్యాధికారం సిద్ధించి అగ్ర కులాల వారు మాకు న్యాయం కావాలి అని రోడ్ల మీదకు రావడమే నిజమైన విప్లవం’ అని కాన్షీరామ్ సరికొత్తగా నిర్వచించారు. అంతిమంగా అట్టడుగు వర్గాల విముక్తికి ఉద్యమాలు సాగించిన మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ల సరసన కాన్షీరామ్ నిలిచారు. అంబేద్కరిజాన్ని ఆయుధంగా మలచుకుని బహుజన రాజ్యాధికార సాధన కోసం అవిశ్రాంతంగా ఉద్యమించిన కాన్షీరామ్ 2006 అక్టోబర్ 9 నాడు మరణించారు. ఆయన మరణించిననూ బహుజన బతుకుల్లో వెలుగులు ప్రకాశింపజేస్తూనే ఉన్నారు.
(అక్టోబర్ 9 కాన్షీరామ్ 20వ వర్ధంతి)

రీసెర్చ్ స్కాలర్
సెల్: 94933 19690

