- ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి:పట్లోళ్ల కార్తీక్ రెడ్డి.
శంకర్ పల్లి, అక్టోబర్ 31(ప్రజాక్షేత్రం):మహబూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం శంకర్ పల్లి కేంద్రంలో సిటిజన్ ప్యాలెస్లో బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండిచేర్ల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బద్దం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ పి. కార్తిక్ రెడ్డి, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ జి. రాంబాబు యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓటర్ల నమోదు అత్యంత కీలకమని నాయకులు పేర్కొన్నారు. శంకర్ పల్లి మండల పరిధిలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటు హక్కు కల్పించే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో నిర్వహించాలని కోరారు. ఈ సన్నాహక సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి చిన్న నరసింహులు, కౌన్సిలర్లు ఉషా విజయ్ కుమార్, బానూరి కృష్ణ, ప్రశాంత్, సర్పంచులు రాఘవేందర్ రెడ్డి, ప్రభువు గౌడ్, పార్టీ నాయకులు శ్రీధర్, శ్రీనాథ్ గౌడ, వాసుకన్నా, తదితరులు పాల్గొన్నారు.


