న్యూఢిల్లీ, నవంబర్ 23(ప్రజాక్షేత్రం):దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు అత్యంత నమ్మకంతో తాగే బిస్లెరీ (Bisleri) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బిస్లెరీ సంస్థ ప్రాంగణం నుండి సేకరించిన నీటి నమూనాలు (Samples) తాగడానికి ఏమాత్రం సురక్షితం కాదని (Unsafe) భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆహార భద్రత చట్టం-2006 కింద బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యలు (ప్రాసిక్యూషన్) ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు FSSAI వెల్లడించింది. బిస్లెరీ ప్లాంట్ నుండి సేకరించిన నీటి నమూనాను తొలుత పరీక్షించగా, అందులో బ్రోమేట్ (Bromate) రసాయన పరిమాణం నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, ఈ నివేదికను సవాలు చేస్తూ బిస్లెరీ సంస్థ అప్పీల్ చేయడంతో ఆ నమూనాను రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. అక్కడి పరీక్షల్లోనూ ఆ నీరు సురక్షితం కాదని నిర్ధారణ కావడమే కాకుండా, క్యాన్సర్ కారకాలుగా భావించే పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. మరోవైపు, ఈ వివాదంపై బిస్లెరీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ వినియోగదారులకు సురక్షితమైన తాగునీటిని అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొంది. ఈ వ్యవహారం సుమారు 14 నెలల క్రితం (సెప్టెంబర్ 2025లో) తమ గోవా ప్లాంట్‌లో తయారైన ఒక బ్యాచ్‌కు సంబంధించినదని, తాము నిర్వహించిన స్వతంత్ర పరీక్షల్లో నీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు తేలిందని సంస్థ వివరణ ఇచ్చింది. నియంత్రణ సంస్థ చేపట్టే తదుపరి ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కాగా, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వసంత్ మసాలా, టిట్-బిట్ ఫుడ్స్, మీమాంస ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ వంటి పలు ఇతర సంస్థలపైనా FSSAI కేసులు నమోదు చేసింది.

