- దేశ యువతను కాపాడుకోవాలని పిలుపు!
న్యూ ఢిల్లీ నవంబర్ 18(ప్రజాక్షేత్రం):దేశంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిపై మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఫిలిప్పీన్స్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో పాల్గొన్న ఆయన, డ్రగ్స్ వ్యసనం యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గద్గద స్వరంతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. “మన దేశం నుంచి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించగలిగినప్పుడు, డ్రగ్స్ మహమ్మారిని ఎందుకు అంతం చేయలేము? ఏ ధర చెల్లించైనా సరే, మన యువతను ఈ మత్తు ఊబిలో పడకుండా కాపాడుకోవాలి!” అని ప్రధాని మోదీ మంత్రులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ కట్టడిపై దేశవ్యాప్తంగా ‘మిషన్ మోడ్’లో కఠిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కాగా యువతపై డ్రగ్స్ ప్రభావంపై గత వారం ‘మాన్ కీ బాత్’లో సైతం ప్రధాని తన ఆవేదనను వ్యక్తం చేస్తూ యువతకు తన సందేశాన్ని అందించారు.

