రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం!
- అప్పుల కుప్పగా మార్చారు.. ఆ బద్నాం నేను మోస్తున్నా..
- కాళేశ్వరం లేకున్నా దేశంలో మనమే నం.1
- రైతు భరోసా నిధుల విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జూన్ 30(ప్రజాక్షేత్రం):గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకోవాలనే ఆశతోనే గత పాలకులు ఎలాంటి ముందుచూపు లేకుండా హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును తలకెత్తుకున్నారని ఆరోపించారు. దాదాపు లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కూలిపోయినప్పటికీ.. వరి పండించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని సీఎం స్పష్టం చేశారు. రైతులు తమ సొంత బోరు బావుల కింద కష్టపడి పంటలు పండిస్తుంటే.. అదంతా కాళేశ్వరం మహిమేనంటూ గత ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగిన ‘రైతు భరోసా’ నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై, నిధుల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు.
అప్పుల కుప్పగా మార్చారు.. ఆ బద్నాం నేను మోస్తున్నా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 19 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే వారు చేసిన అప్పు కేవలం 60 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏకంగా రూ.8.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసి, ఆ భారాన్ని తమ ప్రభుత్వ నెత్తిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల ఆర్థిక లొసుగుల వల్ల 2023 నాటికి సీఎస్ వంటి అత్యున్నత ఐఏఎస్ అధికారులకు కూడా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. బడి పిల్లల భోజనాలతో పాటు, గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు చేసిన వేల కోట్ల రూపాయల బిల్లులను కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారని.. కానీ ప్రస్తుతం ఆ బకాయిల కోసం సర్పంచ్‌లు ధర్నాలు చేస్తుంటే, ఆ బద్నాం తాను భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అడ్డగోలు అప్పుల వల్ల దేశ రాజధాని దిల్లీలో సైతం రాష్ట్ర పరువు పోయే పరిస్థితి దాపురించిందన్నారు.
రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం!
గతంలో ‘వరి వేస్తే ఉరే’ అంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేసి, వారు పండించిన పంటను కొనుగోలు చేయకుండా బీఆర్ఎస్ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని సీఎం విమర్శించారు. కేసీఆర్ తన హయాంలో ఒక్కసారైనా రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేశారా? అని నిలదీశారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఊరూరా బెల్ట్ షాపులు పెంచి రాష్ట్రంలో తాగుడు సంస్కృతిని పెంచి పోషించారని ఆరోపించారు.
తమ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, సాగు పనులు ప్రారంభమయ్యే సమయానికే ‘రైతు భరోసా’ నిధులను అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే 9 రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.9,000 కోట్లను జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నందున.. రైతులు వరి సాగును కొంతవరకు తగ్గించుకుని, లాభదాయకమైన మెట్ట పంటల వైపు మొగ్గు చూపాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హితవు పలికారు.

