ఆపద్భాందవుల సాహసం.. డోలీ మోతతో ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది!
ములుగు జులై 17(ప్రజాక్షేత్రం):ప్రభుత్వాలు మారుతున్నా మారుమూల గిరిజన ప్రాంతాల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లోనూ రోగులను డోలీలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విధినే దైవంగా భావించిన 108 అంబులెన్స్ సిబ్బంది అసాధారణ సాహసం చేసి ఓ యువకుడి ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఎ పరిధిలోని గుర్రాలబావి గ్రామానికి చెందిన గోత్తికోయ గిరిజన యువకుడు మడకం అయితయ్య (18) గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స తీసుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక, పరిస్థితి విషమించడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటి) శివలింగం ప్రసాద్, పైలట్ కోటి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామానికి వెళ్లే రహదారి లేకపోవడంతో అంబులెన్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయినా వెనుకడుగు వేయని 108 సిబ్బంది బురదతో నిండిన కాలిబాటలో నడుచుకుంటూ గ్రామానికి చేరుకుని, గ్రామస్థుల సహాయంతో బాధితుడిని డోలీలో మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోవడంతో పాటు తీవ్ర జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ఈఆర్సీపీ డాక్టర్ మౌనిక సూచనల మేరకు అత్యవసర చికిత్సగా గ్లూకోజ్, అవసరమైన మందులు, ఇంజెక్షన్లు అందించి, వెంటనే ఏటూరునాగారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితిని వైద్యులకు పూర్తిగా వివరించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. కనీస రహదారి సౌకర్యం లేకపోయినా ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో విధులు నిర్వహించిన 108 అంబులెన్స్ సిబ్బంది సేవలను స్థానికులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ప్రశంసించారు. ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్న 108 సిబ్బంది నిజమైన ఆపద్భాందవులని కొనియాడుతూ, మారుమూల గిరిజన గ్రామాలకు తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


