📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
Homeతెలంగాణమా భూమి ప్రజాసాహిత్య పురస్కారం' తో మిట్టపల్లికి మరో అపూర్వ గౌరవం..

మా భూమి ప్రజాసాహిత్య పురస్కారం’ తో మిట్టపల్లికి మరో అపూర్వ గౌరవం..

📰 Generate e-Paper Clip

మా భూమి ప్రజాసాహిత్య పురస్కారం’ తో మిట్టపల్లికి మరో అపూర్వ గౌరవం..

  • పాటలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సురేందర్

మందమర్రి, జూన్ 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ మట్టివాసనను అక్షరాల్లో ఆవిష్కరించి, ప్రజల భావోద్వేగాలను పాటలుగా మలిచి, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో చిరస్థాయిగా నిలబెట్టిన ప్రముఖ సినీ గేయరచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మక ‘మా భూమి ప్రజా సాహిత్య పురస్కారం–2024’కు ఆయనను ఎంపిక చేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, జానపద జీవన విధానాన్ని తన గీతాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మిట్టపల్లి సురేందర్కు ఈ పురస్కారం దక్కడం సాహిత్య, సాంస్కృతిక రంగాలకు గర్వకారణమని జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్, తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాన్ల మధుకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజల గొంతుకగా నిలిచిన రచయితలను, ప్రజా చైతన్యానికి దిక్సూచిగా నిలిచిన సాహితీవేత్తలను సత్కరించాలనే సంకల్పంతో 2024 నుంచి ప్రతి ఏడాది ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా అందజేస్తున్నట్లు ‘మా భూమి ప్రజా సాహిత్య పురస్కారం’ను తెలిపారు.గతంలో ప్రజాకవులు గోరటి వెంకన్న, జయరాజ్ ఈ గౌరవాన్ని అందుకోగా, ఈసారి మిట్టపల్లి సురేందర్ ఎంపిక కావడం అత్యంత సముచిత నిర్ణయమని పేర్కొన్నారు. జూలై 12న హైదరాబాద్లోని ఎల్బీనగర్ వాసవి శ్రీనిలయంలో నిర్వహించే ప్రత్యేక సభలో ఈ పురస్కారాన్ని మిట్టపల్లి సురేందర్కు ఘనంగా ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఆత్మను తన గేయాల్లో ప్రతిధ్వనింపజేస్తూ, పల్లె జీవన సౌందర్యాన్ని, ప్రజల కష్టసుఖాలను, ఉద్యమ స్ఫూర్తిని భావోద్వేగభరితమైన పదాలతో ఆవిష్కరించిన మిట్టపల్లి సురేందర్ సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన మా భూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక నిర్వాహకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. “మట్టి పరిమళాన్ని పదాల్లో నింపిన కవి… ప్రజల గుండె చప్పుడిని పాటగా పలికించిన గేయకారుడు… తెలంగాణ ఆత్మను అక్షరాల్లో ఆవిష్కరించిన సాహిత్యయోధుడికి ‘మా భూమి’ పురస్కారం దక్కడం తెలుగు సాహిత్య ప్రపంచానికే గర్వకారణం” అని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా రామగిరి అర్జున్, అడ్డగూరి లక్ష్మణ్, కొండపర్తి సదానందం, వేల్పుల రమేష్, గిరి. ఉడుత సాగర్, స్టాలిన్, విజయ్ తదితరులు మిట్టపల్లి సురేందర్ను అభినందిస్తూ ఆయన మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular