హామీలకే పరిమితమైన బ్రిడ్జి..
- మంత్రి ఇలాకాలోనే మొదలుకాని బ్రిడ్జి నిర్మాణం..
- ఏండ్లు గడుస్తున్నా ప్రయాణికులకు తప్పని తిప్పలు
- నిత్యం నరకయాతన పడుతున్న వాహనదారులు
చిగురుమామిడి, జూలై 30(ప్రజాక్షేత్రం):కరీంనగర్–సిద్దిపేట జిల్లాలను అనుసంధానించే కీలక బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి పలుమార్లు హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గమే రెండు జిల్లాల మధ్య ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు అంతరాయం కలిగే పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర సేవల వాహనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఇంత కీలకమైన బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించాలని స్థానికులు, ప్రయాణికులు ప్రభుత్వన్ని కోరుతున్నారు.

