📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
Homeఇంటర్నేషనల్హోర్ముజ్ జలసంధిలో రణరంగం

హోర్ముజ్ జలసంధిలో రణరంగం

📰 Generate e-Paper Clip

హోర్ముజ్ జలసంధిలో రణరంగం

  • అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు..
  • ట్రంప్ ‘విధ్వంసకర’ హెచ్చరికతో ప్రపంచం విలవిల!
  • హోర్ముజ్ పై పట్టు కోసం అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు
  • ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన వనరులే లక్ష్యంగా దాడులు
  • ఇరాన్ ను పూర్తిగా ధ్వంసం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక
  • రణరంగంతో స్తంభించిన ప్రపంచ చమురు రవాణా
  • అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.

వాషింగ్టన్/టెహ్రాన్ జులై 15(ప్రజాక్షేత్రం):పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) మరోసారి భీకర యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పై పట్టు కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో ఈ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని, తామే దానికి ‘రక్షకుడు’ అవుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో పాటు, జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ అత్యంత దూకుడుగా స్పందిస్తూ, వచ్చే వారం ఇరాన్‌కు రోజులు చాలా దారుణంగా ఉండబోతున్నాయని హెచ్చరించారు. వారు వెంటనే చర్చల టేబుల్ ముందుకు రాకపోతే.. ఇరాన్‌లోని అన్ని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను బాంబులతో పేల్చి పూర్తిగా ధ్వంసం చేస్తామని, చివరగా వారి ఇంధన వనరులపై కూడా దాడులు చేస్తామని నేరుగా అత్యంత ‘విధ్వంసకర’ అల్టిమేటం ఇచ్చారు. మరోవైపు అమెరికా వైమానిక దళాలు ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాలపై పూర్తి నౌకాదళ దిగ్బంధనాన్ని విధించాయి. ఇరాన్ దళాలు ఏడు వాణిజ్య నౌకలపై దాడులు చేసి, 11 మంది సిబ్బంది మరణానికి కారణమవ్వడంతో అమెరికా సైన్యం ఈ చర్యకు పూనుకుంది. బుధవారం ఉదయం అమెరికా దళాలు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణి నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్ సైట్లు మరియు గ్రేటర్ తుంబ్, క్విష్మ్ ద్వీపాల్లోని ఐఆర్‌జీసీ స్థావరాలపై సుమారు 90 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు ఇరాన్ సైనిక సిబ్బంది మరణించినట్లు టెహ్రాన్ ధృవీకరించింది. ఈ అమెరికా దాడులకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంతే కసితో, దీటుగా బదులిచ్చింది. అమెరికా బలగాలకు రక్షణ కల్పిస్తున్న పొరుగు దేశాలపై ఇరాన్ విరుచుకుపడింది. బహ్రెయిన్ రాజధానిలోని అమెరికా నౌకాదళ మద్దతు స్థావరం, కువైట్, జోర్డాన్‌లలోని యూఎస్ మిలిటరీ క్యాంపులపై ఇరాన్ వందలాది క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి తెగబడింది. ఈ క్రమంలో బహ్రెయిన్‌లో బాంబు పేలుళ్ల సైరన్లు మోగగా, జోర్డాన్, కువైట్ సైన్యాలు తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను అడ్డుకునేందుకు రంగంలోకి దిగాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో ఐదో వంతు కేవలం ఈ హోర్ముజ్ జలసంధి గుండానే వెళుతుంది. ఇరు దేశాల రణరంగంగా మారడంతో ఈ మార్గంలో ఓడల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అమెరికా తమపై ఈ దుర్మార్గాన్ని ఆపకపోతే, మిడిల్ ఈస్ట్ నుండి ప్రపంచంలోని ఏ దేశానికి కూడా ఒక్క చుక్క చమురు లేదా గ్యాస్ వెళ్లకుండా అడ్డుకుంటామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఈ పెను ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. జూన్‌లో జరిగిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఈ తాజా దాడులతో పూర్తిగా కుప్పకూలిపోగా.. ట్రంప్ కఠిన వైఖరి, ఇరాన్ దూకుడు చూస్తుంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే పెను ఆర్థిక యుద్ధంగా మారబోతోందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular